Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోలని ‘తన విగ్రహాన్ని తగలపెట్టిన ముస్లింలపై కాళీ మాత ప్రతీకారం’ అని షేర్ చేస్తున్నారు

0

తన విగ్రహాన్ని ఏ విధంగా అయితే తగలబెట్టారో, అదే విధంగా ముస్లింలని తగలబెట్టిన కాళీ మాత అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటివలే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాళీ మాత విగ్రహాన్ని అక్కడి ముస్లింలు కాల్చేసారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేసిన నేపథ్యంలో, ఈ పోస్టులోని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తన విగ్రహాన్ని ఏ విధంగా అయితే తగలబెట్టారో, అదే విధంగా ముస్లింలని తగలబెట్టి ప్రతీకారం తీర్చుకున్న కాళీ మాత.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని ఆ కాళీ మాత విగ్రహం ప్రమాదవశాత్తు కాలిపోయిందని, ఈ ఘటనలో అక్కడి ముస్లింల పాత్ర లేదని పోలీసులు ఇంతకు ముందే స్పష్టం చేశారు. పోస్టులో గాయపడి ఉన్న వ్యక్తుల ఫోటో బంగ్లాదేశ్ లోని నారాయణ్ గంజ్ అనే మజిదులో చోటు చేసుకున్న ఫైర్ ఆక్సిడెంట్ వల్ల క్షతగాత్రులైన వారివి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఆలంపూర్ గ్రామ దేవాలయంలోని కాళీ మాత విగ్రహం, ‘31 ఆగష్టు 2020’ నాటి రాత్రి ప్రమాదవశాత్తు కాలిపోయిందని, ఈ ఘటనలో అక్కడి ముస్లింల పాత్ర లేదని ఆ దేవాలయపు సెక్రటరీ సుఖదేవ్ బాజ్పాయ్ తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ ముర్షిదాబాద్ జిల్లా పోలీస్ వారు తమ ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన ట్వీట్ ఇక్కడ చూడవచ్చు. ఈ ఘటనలో ముస్లింల పాత్ర లేదని ‘FACTLY’ రాసిన  ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే దృశ్యం తో కూడిన ఒక వీడియో ‘Viral Waz’ అనే బంగ్లాదేశ్ కి చెందిన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసి ఉంది. ‘Narayanganj tolla mosjid’ అనే టైటిల్ తో ఈ వీడియోని ఆ ఛానల్  యూట్యూబ్ లో పోస్ట్ చేసారు. ఢాకా నగర సమీపంలో ఉన్న నారాయణ్ గంజ్ అనే మసీదులో చోటు చేసుకున్న ఫైర్ ఆక్సిడెంట్ వల్ల క్షతగాత్రులైన వారి ఫోటోలు ఇవి అని అందులో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఆ ఘటనకి సంబంధించిన వివరాల కోసం వెతకగా, ‘05 సెప్టెంబర్ 2020’ నాడు బంగ్లాదేశ్ రాజధాని  ఢాకా నగర సమీపంలో ఉన్న నారాయణ్ గంజ్ అనే మసీదులో గ్యాస్ పైప్స్ లీక్ అవ్వడంతో మంటలు పెద్దఎతున్న చెలరేగాయి అని ‘Dhaka Tribune’ అనే వార్తా వెబ్ సైట్ రాసిన ఆర్టికల్ లో తెలిపారు.

చివరగా, సంబంధం లేని ఫోటోలని చూపిస్తూ తన విగ్రహాన్ని తగలపెట్టిన ముస్లింలపై కాళీ మాత ప్రతీకారం తీర్చుకందని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll