ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 4 జూన్ 2024న ప్రకటించబడ్డాయి. మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి 293 సీట్లను గెలుచుకోగా, బీజేపీ 240 సీట్లను మాత్రమే పొందింది. ఒక పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 సీట్ల అవసరం ఉంటుంది. కానీ, బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకోవడం వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీ కూటమి భాగస్వాములతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (SP), తృణమూల్ కాంగ్రెస్ (TMC), ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) మరియు వారి మిత్రపక్షాలతో కూడిన ఇండియా కూటమి మొత్తం 234 స్థానాలను గెలుచుకుంది.
తమిళనాడులో బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేకపోయింది. కోయంబత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై డీఎంకే అభ్యర్థి గణపతి రాజ్‌కుమార్‌పై 1,18,068 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఒక పోలింగ్ బూత్ లో అన్నామలైకి కేవలం ఒక్క ఓటు మాత్రమే పడిందని క్లెయిమ్ చేస్తూ ఆ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఒక రిపోర్ట్ కార్డు ఫోటోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.
క్లెయిమ్: 2024 లోక్ సభ ఎన్నికల్లో కోయంబత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలైకి ఒక పోలింగ్ బూత్ లో కేవేలం ఒక్క ఓటు మాత్రమే పడింది.
ఫాక్ట్ (నిజం): ఇది ఎడిట్ చేసిన ఫోటో. కోయంబత్తూరు లోక్ సభ నియోజకవర్గం మొదటి రౌండ్ వోట్ కౌంటింగ్ రిపోర్ట్ కార్డు ఒరిజినల్ ఫోటోలో బూత్ నంబర్/ఈవీఎం నంబర్ ‘BCUAF 07464’లో అన్నామలైకి 101 ఓట్లు నమోదైనట్లు చూడవచ్చు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ ఫోటోలో షేర్ చేసిన వోట్ కౌంటింగ్ రిపోర్ట్ కార్డ్‌ను సరిగ్గా పరిశీలిస్తే, మొదటి రౌండ్ కౌంటింగ్ తర్వాత అన్నామలైకి వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య 1,852 అని గమనించవచ్చు. కానీ, అన్నామలైకి వచ్చిన అన్ని ఓట్లను ఒక్కొక్కటిగా కూడిస్తే ఆ సంఖ్య 1,752 వస్తుంది. దీన్ని బట్టి, ఒక బూత్‌లో అన్నామలైకి ఒక్క ఓటు మాత్రమే వచ్చిందని తప్పుగా చూపించేందుకు ఈ వైరల్ ఫోటోను ఎడిట్ చేసినట్లు స్పష్టమవుతోంది.
వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికితే సన్ న్యూస్ 4 జూన్ 2024న తమ X అకౌంట్ లో షేర్ చేసిన వోట్ కౌంటింగ్ రిపోర్ట్ కార్డు అసలు ఫోటో లభించింది. ఈ ట్వీట్ లో కోయంబత్తూరు లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన మొదటి రౌండ్ వోట్ కౌంటింగ్ అని పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన వివరాలు కోసం ఇంటర్నెట్ లో మరింత వెతకగా X (ట్విట్టర్) లో ఈ వైరల్ పోస్ట్‌లలో ఒకదాని కింద, తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ రాజ్ ఈ ఫోటోని ఎడిట్ చేసారని చెప్తూ మొదటి రౌండ్ వోట్ కౌంటింగ్ రిపోర్ట్ కార్డు ఒరిజినల్ ఫోటోను షేర్ చేసారు. అంతేకాక, కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో మొదటి రౌండ్ కౌంటింగ్ కి సంబంధించిన రిపోర్ట్ కార్డుని ప్రచురించిన వార్తా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
మొదటి రౌండ్ కౌంటింగ్ రిపోర్ట్ కార్డ్ ఒరిజినల్ ఫోటో మరియు వైరల్ ఫోటో కి మధ్య తేడాలను కింద ఫొటోలో గమనించవచ్చు. అసలు ఫోటోలో బూత్ నంబర్/ఈవీఎం నంబర్ ‘BCUAF 07464’లో అన్నామలైకి 101 ఓట్లు నమోదైనట్లు ఉంటే, వైరల్ ఫోటోలో కేవలం ఒక ఓటు మాత్రమే నమోదైనట్టు కనిపించేలా ఎడిట్ చేసారని స్పష్టం అవుతుంది.
చివరగా, ఎడిట్ చేసిన ఫోటోను 2024 లోక్‌సభ ఎన్నికలలో అన్నామలైకి ఒక పోలింగ్ బూత్‌లో ఒక్క ఓటు మాత్రమే వచ్చిందని షేర్ చేస్తున్నారు.