Fake News, Telugu
 

పశ్చిమ బెంగాల్ లో ప్రమాదవశాత్తు కాలిపోయిన కాళీమాత విగ్రహాన్ని ముస్లింలు తగలపెట్టారని షేర్ చేస్తున్నారు

0

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గర్భగుడిని, అందులో ఉన్న కాళీమాత విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలపెట్టిన జిహాదిలు, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాళీమాత విగ్రహన్ని తగలపెట్టిన ముస్లింలు.

ఫాక్ట్ (నిజం):  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆలంపూర్ అనే గ్రామంలో ఉన్న కాళీమాత దేవాలయంలోని ఈ విగ్రహం, ‘31 ఆగష్టు 2020’ నాడు ప్రమాదవశాత్తు కాలిపోయినట్టు ఆ దేవాలయపు సెక్రటరీ స్పష్టం చేసారు. ఈ ఘటనని వాడుకొని కొందరు మతపరమైన విద్వెషాలని రెచ్చగొడుతున్నారని వారు తెలిపారు. ముర్షిదాబాద్ పోలీస్ వారు కూడా ఇదే విషయాన్నే తెలుపుతూ ట్వీట్ పెట్టారు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోని షేర్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ఎంపి అర్జున్ సింగ్ ‘ఆలంపూర్ లోని కాళీమాత విగ్రహన్ని తగలపెట్టిన ముస్లింలు’ అని క్లెయిమ్ చేస్తూ పెట్టిన ట్వీట్ దొరికింది. పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు అని ముర్షిదాబాద్ జిల్లా పోలీసులు ఆ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు. వెస్ట్ బెంగాల్ పోలీస్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ కూడా అర్జున్ సింగ్ ట్వీట్ తప్పుదోవ పట్టిస్తోందని తెలిపారు.

ముర్షిదాబాద్ జిల్లాలోని ఆలంపూర్ అనే గ్రామంలో ఉన్న కాళీమాత దేవాలయంలోని ఈ విగ్రహం, ‘31 ఆగష్టు 2020’ నాడు ప్రమాదవశాత్తు కాలిపోయినట్టు ఆ దేవాలయపు సెక్రటరీ స్పష్టం చేసారని ముర్షిదాబాద్ పోలీసులు పెట్టిన మరొక  ట్వీట్ లో స్పష్టంగా తెలిపారు.  పోలీసులు పోస్ట్ చేసిన ఈ ట్వీట్లో కాళీమాత దేవాలయపు సెక్రటరీ పెట్టిన ఫేస్బుక్ పోస్ట్ స్క్రీన్ షాట్ షేర్ చేసారు. కాళీమాత దేవాలయపు సెక్రటరీ పెట్టిన ఆ పోస్టులో, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని, తమ గ్రామంలో హిందూ ముస్లింలు మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి అని తెలిపారు. ఈ ఘటనని వాడుకొని కొందరు అనవసరంగా మతపరమైన విద్వెషాలని రెచ్చగొడుతున్నారని వారు ఆ పోస్టులో తెలిపారు.

ఆలంపూర్ కాళీమాత దేవాలయపు సెక్రటరీ సుఖదేవ్ బాజ్పాయ్ ఈ సంఘటనపై స్పష్టత ఇచ్చిన వీడియో ఇక్కడ చుడవ్వొచ్చు.

చివరగా, ప్రమాదవశాత్తు కాలిపోయిన కాళీమాత మాత విగ్రహాన్ని చూపిస్తూ పశ్చిమ బెంగాల్ లో ముస్లింలు కాళీమాత విగ్రహాన్ని తగలపెట్టారని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll