స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 03 జనవరి 2025న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన బీసీ మహాసభ జరిగింది. ఈ సభలో జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని, వెంటనే బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలోనే,“ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ మహాసభలో కవిత మాట్లాడుతూ తెలంగాణలో 90% పైగా వెలమ ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారని, వెలమ కులాన్ని బీసీ-ఏ కేటగిరీలో చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపొతే ఇందిరా పార్క్ వద్ద ఆమరణ దీక్షకు దిగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు” అని పేర్కొంటూ ‘Way2News’ కథనం ప్రచురించట్లు న్యూస్ క్లిప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: 03 జనవరి 2025న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని అన్నట్లు ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.
ఫాక్ట్(నిజం): 03 జనవరి 2025న ఇందిరాపార్కులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని అనలేదు. అలాగే వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని కవిత అన్నట్లు ‘Way2News’ కూడా వార్తా కథనం ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 04 జనవరి 2025న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా 03 జనవరి 2025న ఇందిరాపార్కులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని అని అన్నారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని కవిత డిమాండ్ చేసినట్లు చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్/ వార్తాకథనాలు మాకు లభించలేదు. ఒకవేళ కల్వకుంట్ల కవిత ఇలాంటి డిమండ్ చేసి ఉంటే కచ్చితంగా మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేవి.
అలాగే మేము ‘T News Telugu’ తమ యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేసిన ఈ బీసీ మహాసభ పూర్తి ప్రత్యక్ష ప్రసార వీడియోను కూడా పరిశీలించాము, ఈ సభలో కవిత మాట్లాడుతూ ఎక్కడా ఇలాంటి డిమాండ్ చేయలేదు.
ఈ వార్తను Way2News సంస్థ కూడా ప్రచురించలేదు. ఈ వైరల్ ‘Way2News’ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/c7bgqg) ద్వారా ‘Way2News’ వెబ్‌సైట్‌లో వెతకగా, ఈ సంస్థ 07 డిసెంబర్ 2024న తమిళ భాషలో ప్రచురించిన అసలైన వార్త కథనం దొరికింది. దీన్ని బట్టి అసలైన ‘Way2News’ కథనాన్ని ఎడిట్ చేస్తూ పోస్టులో షేర్ చేసిన ఈ వైరల్ న్యూస్ క్లిప్ ఫోటోను రూపొందించారు అని నిర్థారించవచ్చు.
అంతేకాకుండా, ఈ న్యూస్ క్లిప్ వైరల్ అవడంతో, 04 జనవరి 2025న ‘Way2News’ సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ (ఆర్కైవ్డ్) ద్వారా స్పందిస్తూ,“ఇది Way2News ప్రచురించిన కథనం కాదు, కొందరు మా ఫార్మాట్‌లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చింది. అలాగే, వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌లోని వెబ్ లింక్‌తో వారు ప్రచురించిన అసలు వార్తను కూడా షేర్ చేశారు.
చివరగా, 03 జనవరి 2025న ఇందిరాపార్కులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని అనలేదు. అలాగే వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని కవిత అన్నట్లు ‘Way2News’ కూడా వార్తా కథనం ప్రచురించలేదు.