Fake News, Telugu
 

సంబంధంలేని ఫొటోలను లవ్ జిహాద్‌కు ముడిపెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

0

ఒక హిందూ మహిళ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నాక సూట్‌కేసులో శవంగా పోలీసులకి దొరికిందని, ఈ ఉదంతం లవ్ జిహాద్‌కు సాక్ష్యమని చెప్తూ కొన్ని ఫొటోలు కలిగిన ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న హిందూ మహిళ సూట్‌కేసులో శవంగా దొరికిన దృశ్యాలు.

ఫాక్ట్: పోస్టులో ఉన్న మొదటి రెండూ ఫొటోల్లో ఉన్న మహిళకి, మూడవ ఫొటోలో ఉన్న మహిళ శవానికి సంబంధం లేదు. మొదటి రెండూ ఫొటోలలో ఉన్న మహిళ పేరు సురభి. ఈమె తన భర్త మహమ్మద్ ఆదిల్ పాషాతో ఉత్తరా ఖండ్ రాజధాని డెహ్రాడూన్ ప్రాంతంలో నివసిస్తుంది. ఇక మూడవ ఫొటోలో ఉన్న మహిళ శవం విషయానికి వస్తే, జులై 2020 లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఘజియాబాద్ పోలీసులు ఒక గుర్తు తెలియని మహిళ శవం సూట్‌కేసులో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన మహిళా ఎవరనేది ఇప్పటికీ తెలియలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా సూట్ కేసులో శవం దొరికిన ఘటన గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇదే ఫొటోతో ఉన్న వార్తాకథనాన్ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ 27 జులై 2020లో ప్రచురించింది. ఈ కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గుర్తు తెలియని మహిళ శవం సూట్‌కేసులో ఉండటాన్ని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

అయితే, ఈ శవం వారిష అలీ (22) అనే యువతిదే అని ఆమె కుటుంబ సభ్యులు చెప్పడంతో, తమ కుమార్తెని అత్తింటి వాళ్ళు అదనపు కట్నం ఇవ్వలేదనే కారణంతో హత్య చేశారని వారు ఆరోపించారు. ఇదిలా ఉండగా, 03 ఆగస్టు 2020న, తాను బ్రతికే ఉన్నానని వారిష అలీ పోలీసుల ముందుకొచ్చింది. శవాన్ని తప్పుగా గుర్తించామని తెలుసుకున్న ఘజియాబాద్ పోలీసులు కేసు విచారణ మళ్ళీ తిరిగి చేపట్టారు. చనిపోయిన మహిళా ఎవరనేది ఇప్పటికీ తెలియలేదు. సంబంధిత వార్తా కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చనిపోయిన మహిళ ఫోటోని ‘దైనిక్ జాగరణ్’ ప్రచురించిన ఈ వార్తా కథనంలో చూడవచ్చు.

ఇక వైరల్ పోస్టులో ఉన్న జంట ఎవరనే దానిపై ఇంటర్నెట్లో వెతకగా సోషల్ మీడియాలో లభించిన పోస్టులను (ఇక్కడ మరియు ఇక్కడ) బట్టి వారు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన ‘లవీ జోషి అలియాస్ సురభి’ మరియు ‘మహమ్మద్ ఆదిల్ పాషా’ గా గుర్తించాము. ఇదే విషయంపై ‘Fact Crescendo’ సెప్టెంబర్ 2020లో డెహ్రాడూన్ పోలీసులని సంప్రదించగా, అటువంటి హత్య ఇటీవల తమ వద్ద జరగలేదని వారు చెప్పారు. అలాగే, సురభిని సంప్రదించగా, ఆ హత్య కేసుతో తనకి ఎటువంటి సంబంధం లేదని, ప్రస్తుతం తన భర్త అయిన మహమ్మద్ ఆదిల్ పాషాతో కలిసి డెహ్రాడూన్ ప్రాంతంలో ఉంటున్నానని ఆమె ఒక ఫొటోని కూడా పంపించడం జరిగింది.

దీనిని బట్టి చనిపోయిన మహిళ సురభి కాదని స్పష్టమవుతుంది.

చివరిగా, సంబంధంలేని ఫొటోలను లవ్ జిహాద్‌కు ముడిపెడుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll