త్రిపురలో 3 కోట్ల గ్యాస్ సిలిండర్లను పంచామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేసారని, త్రిపుర జనాభా 36 లక్షలైతే మిగితా సిలిండర్లను ఆవులకు, ఎద్దులకు పంచరా? అని ఎన్డీటీవీ మాజీ యాంకర్ రవీష్ కుమార్ మోదీని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: త్రిపురలో 3 కోట్ల గ్యాస్ సిలిండర్లను పంచినట్టు నరేంద్ర మోదీ ప్రచారం చేసుకున్నారు; ఈ ప్రచారాన్ని ఎద్దేవా చేస్తూ రవీష్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.
ఫాక్ట్ (నిజం): త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా 11 ఫిబ్రవరి 2023 నాడు త్రిపురలోని అంబాసలో నిర్వహించిన విజయ సంకల్ప ర్యాలీలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ దాదాపు మూడు లక్షల ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు అందాయి”, అని వ్యాఖ్యానించారు. త్రిపురలో 3 కోట్ల గ్యాస్ సిలిండర్లను అందించినట్టు నరేంద్ర మోదీ ఎన్నడూ ప్రచారం చేయలేదు. మోదీ అలా ప్రచారం చేసినట్టు రవీష్ కుమార్ కూడా ఎటువంటి ట్వీట్ లేదా వీడియోని పబ్లిష్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు త్రిపురలో 3 కోట్ల గ్యాస్ సిలిండర్లను అందించామని నరేంద్ర మోదీ ప్రచారం చేసుకున్నారా? అని సంబంధిత కీ పదాలను ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, నరేంద్ర మోదీ అటువంటి ప్రచారం చేసినట్టు ఏ వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది. త్రిపుర ఎన్నికల ప్రచారంలో భాగంగా 11 ఫిబ్రవరి 2023 నాడు త్రిపురలోని అంబాసలో నిర్వహించిన విజయ సంకల్ప ర్యాలీలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ దాదాపు మూడు లక్షల ఇళ్లకు గ్యాస్ కనెక్షన్లు అందాయి”, అని తెలిపారు.
త్రిపురలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కింద 3 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుందని త్రిపుర బీజేపీ ట్విట్టర్ హ్యాండిల్ 2018 మార్చి నెలలో ట్వీట్ పెట్టింది. 2022 జులై నెలలో రిలీజ్ చేసిన ప్రకటనలో, త్రిపురలో PMUY పథకం కింద మొత్తంగా 2,76,481 లబ్ధిదారులకు LPG గ్యాస్ కనెక్షన్లను అందించించినట్టు ప్రభుత్వం తెలిపింది. త్రిపురలో తమ ప్రభుత్వం మూడు కోట్ల గ్యాస్ సిలిండర్లను అందించినట్టు నరేంద్ర మోదీ ఎన్నడూ ఎక్కడ ప్రచారం చేయలేదు.
త్రిపురలో 3 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అందించినట్టు నరేంద్ర మోదీ ప్రచారం చేసుకున్నారని తెలుపుతూ ఎన్డీటీవీ మాజీ యాంకర్ రవీష్ కుమార్ తన యూట్యూబ్ ఛానెల్లో గానీ ట్విటర్ హ్యాండిల్‌లో గానీ ఎటువంటి వీడియో లేదా ట్వీట్‌ని పెట్టలేదు.
చివరగా, త్రిపురలో తమ ప్రభుత్వం 3 కోట్ల గ్యాస్ సిలిండర్లను అందించినట్టు నరేంద్ర మోదీ ప్రచారం చేయలేదు.