Fake News, Telugu
 

సంబంధంలేని వ్యక్తి మృతదేహాన్ని చూపిస్తూ జోయలుక్కాస్ అధినేత కరోనతో మరణించాడని చెప్తున్నారు

0

ఒళ్ళంతా బంగారంతో అలంకరించబడి ఉన్న ఒక మనిషి మృతదేహన్ని చూపిస్తూ, బంగారు నగల వ్యాపార సంస్థ అయిన ‘జోయలుక్కాస్’ అధినేత ‘జాయ్ అరక్కల్’ కరోనా వైరస్ తో మిడిల్ ఈస్ట్ లో చనిపోయాడు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బంగారు నగల వ్యాపార సంస్థ ‘జోయలుక్కాస్’ అధినేత ‘జాయ్ అరక్కల్’ కరోనా వైరస్ తో మిడిల్ ఈస్ట్ లో చనిపోయాడు.

ఫాక్ట్ (నిజం): మొదటి ఫోటోలో ఉన్న వ్యక్తి ట్రినిడాడ్ కి చెందిన శేరోన్ సుఖ్ డియో, ఇతనికి జోయలుక్కాస్ అధినేతకి అసలు ఎటువంటి సంబంధం లేదు. ఇంకా ‘జోయాలుక్కాస్’ సంస్థ అధినేత ‘జాయ్ అలుక్కాస్’; ‘జాయ్ అరక్కల్’ కాదు. జాయ్ అరక్కల్ ‘ఇన్నోవా గ్రూప్ అఫ్ కంపెనీస్’ కి మ్యానేజింగ్ డైరెక్టర్, ఈయన ఆర్ధిక కారణాలతో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని దుబాయ్ పోలీసులు నిర్ధారించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఫోటో 1:

ఈ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోతో కూడిన రిజల్ట్స్ మాకు చాల కనిపించాయి. ఈ రిజల్ట్స్ ప్రకారం ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ట్రినిడాడ్ కి చెందిన శేరోన్ సుఖ్ డియో, ఇతను 2018లో కాల్చి చంపబడ్డాడు. ఇతని అంత్యక్రియల సందర్భంలో ఇతని మృతదేహన్ని బంగారు నగలతో అలంకరించారు. దినికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి పోస్టులో చూపిస్తున్నది జోయలుక్కాస్ అధినేతది కాదని కచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే జోయలుక్కాస్ అధినేతగా తప్పుగా అభిప్రాయపడుతున్న జాయ్ అరక్కల్ 23 ఏప్రిల్ 2020న చనిపోయాడు.

ఫోటో 2:

‘జోయాలుక్కాస్’ సంస్థ అధినేత ‘జాయ్ అలుక్కాస్’; ‘జాయ్ అరక్కల్’ కాదు. జాయ్ అరక్కల్ UAE కేంద్రంగా పని చేసే ‘ఇన్నోవా గ్రూప్ అఫ్ కంపెనీస్’ కి మ్యానేజింగ్ డైరెక్టర్. ఆయన దుబాయ్ లో 23 ఏప్రిల్ 2020 న మరణించాడు. మొదట ఆయన గుండె జబ్బు తో మరణించి ఉంటాడనే వార్తలు వచ్చాయి, కానీ ఇటివలే దుబాయ్ పోలీసులు జాయ్ అరక్కల్ ఆర్ధిక కారణాలతో ఒక బిల్డింగ్ లోని 14వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. ‘జోయాలుక్కాస్’ వారు ఒక ఫేస్బుక్ పోస్టు లో జాయ్ అలుక్కాస్ (ఆ సంస్థ అధినేత) కి సంబంధించి తప్పుడు వార్తలు వస్తున్నాయని, ఆయన సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసారు. అంతేకాదు, చనిపొయిన ‘జాయ్ అరక్కల్’ కి తమ సంస్థ తో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

చివరగా, సంబంధంలేని వ్యక్తి మృతదేహాన్ని చూపిస్తూ జోయలుక్కాస్ అధినేత కరోనతో మరణించాడని చెప్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll