Fake News, Telugu
 

2050 నాటికి ప్రపంచమంతా హిందుత్వమయం అవుతుందని ఏ అమెరికన్ సంస్థ చెప్పలేదు

0

2050 నాటికి ప్రపంచమంతా హిందుత్వమయం అవుతుందని ప్రఖ్యాత అమెరికా సర్వే సంస్థ ఇగ్నోయిస్ చెప్పిందంటున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 2050 నాటికి ప్రపంచమంతా హిందుత్వమయం – అమెరికా సర్వే సంస్థ ఇగ్నోయిస్

ఫాక్ట్(నిజం): ఇగ్నోయిస్ పేరుగల ఒక అమెరికన్ సర్వే సంస్థ ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు. వేరే ఇతర ప్రముఖ సర్వే సంస్థలు కూడా 2050 నాటికి ప్రపంచమంతా హిందుత్వమయం అవుతుందని ఎటువంటి నివేదిక విడుదల చేయలేదు. పోస్టులో షేర్ చేసిన వార్త పూర్తిగా కల్పితం.  ఐతే గతంలో ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రపంచవ్యప్తంగా మతాలపై చేసిన సర్వే ప్రకారం 2050 కల్లా హిందూ మతం ప్రపంచంలో మూడో అతి పెద్ద మతంగా అవతరిస్తుంది. కాకపోతే 2010 -50 మధ్య కాలంలో హిందూ మతాన్ని ఆచరించే వారి సంఖ్యలో పెద్దగా మార్పు మాత్రం ఉండదని ఈ సర్వే తేల్చింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ వార్తకు సంబంధించి సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా, ఇగ్నోయిస్ పేరుగల ఒక అమెరికన్ సర్వే సంస్థ గురించి మాకు ఎటువంటి సమాచారం దొరకలేదు.

అసలు 2050 నాటికి ప్రపంచమంతా హిందుత్వమయం అవుతుందని ఏదైనా ప్రఖ్యాత సంస్థ వెల్లడించినట్టు కూడా ఎటువంటి వార్తా కథనాలు గానీ నివేదికలు గానీ లేవు.

సాధారణంగా పోస్టులో చెప్తున్నట్టు ఏదైనా సంస్థ ఇలాంటి వ్యాఖ్యలు/నివేదికలు చేస్తే, మీడియా రిపోర్ట్ చేస్తుంది. కాని మాకు ఈ విషయమై ఎలాంటి మీడియా కథనాలు లభించలేదు.

2050 నాటికి హిందూ మతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద మతంగా అవతరిస్తుంది :

ఐతే ప్రపంచ జనాభాను అంచనా వేస్తూ కొన్ని ప్రముఖ సంస్థలు రీసెర్చ్ నిర్వహించాయి. ఈ అంశానికి సంబంధించి ప్యూ రీసెర్చ్ సెంటర్ గతంలో విడుదల చేసిన రీసెర్చ్ వివరాల ప్రకారం 2050 నాటికి హిందూ మతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద మతంగా అవతరిస్తుందని అంచనా వేసింది. సంతానోత్పత్తి రేట్లు, యువత జనాభా పెరుగుదలలో పోకడలు మరియు మత మార్పిడి గణాంకాలను పరిగణించి ప్యూ ఈ అంచనాలు వేసింది.

ఈ అంచనా ప్రకారం 2050 కల్లా ప్రపంచవ్యాప్తంగా హిందూ జనాభా 34% పెరుగుదలతో 1.4 బిలియన్లకు చేరుకుంటుంది. ఐతే 2050లో మొత్తం ప్రపంచ జనాభాలో హిందూ మతాన్ని ఆచరించే వారి సంఖ్య 14.9% ఉంటుందని ఈ సర్వే తెలిపింది.

ఐతే ప్యూ రీసెర్చ్ ప్రకారం 2050లో ప్రపంచ జనాభాలో క్రైస్తవులు మరియు ముస్లింల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని తేల్చింది. 2050 నాటికి ముస్లింలు 30% (2.8 బిలియన్లు) మరియు క్రైస్తవులు 31% (2.9 బిలియన్లు) ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే 2070 కాళ్ళ ఇస్లాం ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఆచరించే మతంగా నిలుస్తుందని కూడా అంచనా వేసింది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కూడా గతంలో ప్యూ రీసెర్చ్ రిపోర్ట్ ఆధారంగా ఒక నివేదిక విడుదల చేసింది. 2010 – 2050 మధ్య కాలంలో హిందువుల సంఖ్య 400 మిలియన్లు పెరుగుతుందని,  రాబోయే దశాబ్దాలలో ప్రపంచ జనాభాలో హిందువుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండదని ఈ నివేదికలో పేర్కొంది.

చివరగా, 2050 నాటికి ప్రపంచమంతా హిందుత్వమయం అవుతుందని ఏ అమెరికన్ సంస్థ తేల్చలేదు.

Share.

About Author

Comments are closed.

scroll