Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోని సగం కాలిన పి.వీ.నరసింహారావు భౌతికకాయాన్ని కుక్కలు తింటున్న ఫోటో అని షేర్ చేస్తున్నారు

0

సగం కాలిన మాజీ ప్రధానమంత్రి పి.వీ.నరసింహారావు భౌతికకాయాన్ని కుక్కలు తింటున్న విషాదకరమైన ఫోటో అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ పి.వీ.నరసింహారావు భౌతికకాయానికి అనాథ శవంలా అంత్యక్రియలు జరిపిన తీరుని ఈ పోస్టులో విమర్శిస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: మాజీ ప్రధాని పి.వీ.నరసింహారావు భౌతికకాయాన్ని కుక్కలు తింటున్న చిత్రం.

ఫాక్ట్ (నిజం): ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా నగరంలోని యమునా నది తీరాన ఒక కుక్క మనిషి శవాన్ని తింటున్న దృశ్యాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. 2004లో మాజీ ప్రధాని పి.వీ.నరసింహారావు అంత్యక్రియలను అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రస్తుత తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. అంత్యక్రియలు జరిగిన రోజు రాత్రి సగం కాలిన పి.వీ.నరసింహారావు భౌతికకాయం దగ్గర కుక్కలు గుమిగూడిన మాట వాస్తవం. కానీ, పోస్టులో షేర్ చేసిన ఫోటోతో ఆ సంఘటనకు సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.  

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని ‘Alamy’ వెబ్సైటులో ఫ్రాంక్  మెటాయిస్ అనే ట్రావెల్ ఫొటోగ్రాఫర్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా నగరంలోని యమునా నది తీరాన ఒక కుక్క మనిషి శవాన్ని తింటున్న చిత్రమనీ ఈ ఫోటోని షేర్ చేస్తూ తెలిపారు. ఫ్రాంక్ మెటాయిస్ గురించిన మరింత సమాచారం మరియు అతను తీసిన ఇతర ఫోటోలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

కాంగ్రెస్ నాయకుడు మరియు మాజీ ప్రధానమంత్రి పి.వీ.నరసింహారావు 23 డిసెంబర్ 2004 నాడు ఢిల్లీలో కన్నుమూశారు. 25 డిసెంబర్ 2004 నాడు పి. వీ. నరసింహారావు అంత్యక్రియలను అప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రస్తుత తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. పి.వీ.నరసింహారావు అంత్యక్రియలకు సంబంధించిన చిత్రాలు మరియు వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అంత్యక్రియలు జరిగిన రోజు రాత్రి సగం కాలిన పి.వీ.నరసింహారావు భౌతికకాయం దగ్గర కుక్కలు గుమిగూడిన ఘటనను పి.వీ నరసింహారావు కుమారుడు పి. వీ. ప్రభాకర్ రావు ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఈ ఘటనను పలు వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేశాయి. అయితే, పోస్టులో షేర్ చేసిన ఫోటో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా నగరంలోని యమునా నది దగ్గర తీశారు. ఈ ఫోటోతో మాజీ ప్రధాని పి.వీ.నరసింహారావుకు ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, సంబంధం లేని ఫోటోని సగం కాలిన పి.వీ.నరసింహారావు భౌతికకాయాన్ని కుక్కలు తింటున్న చిత్రమంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll