‘జమ్మూ కాశ్మీర్ చరిత్రలో మొదటిసారి SC ST లకు అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్ కల్పించిన మోదీ సర్కార్’ అంటున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: జమ్మూ కాశ్మీర్ చరిత్రలో మొదటిసారి SC,ST లకు అసెంబ్లీ సీట్లలో రిజర్వేషన్ కల్పించిన మోదీ సర్కార్.
ఫాక్ట్(నిజం): ఇటీవల జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో మొదటిసారి రాష్ట్రంలో STలకు పలు నియోజికవర్గాలను రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది. ఐతే కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ ప్రతిపాదనలను ఆమోదించలేదు. ఇకపోతే SCలకు రాష్ట్రంలో మొదటినుండే రిజర్వేషన్ అమలులో ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ నియోజికవర్గాల పునర్విభజకు సంబంధించి ఆధ్యయనం చేసి ప్రతిపాదనలు అందించాలనే ఉద్దేశంతో మార్చ్ 2020లో కేంద్ర ప్రభుత్వం ఒక డీలిమిటేషన్ కమిషన్‌ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ని అనేక సంప్రదింపుల తర్వాత పలు ప్రతిపాదనలు చేస్తూ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించింది.
STలకు తొమ్మిది, SCలకు ఏడు నియోజికవర్గాలను రిజర్వ్ చేయడం ఈ కమిషన్ చేసిన పలు ప్రతిపాదనలో ఒకటి. ఐతే పోస్టులో చెప్తునట్టు చరిత్రలో మొదటిసారి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో STలకు పలు నియోజికవర్గాలు రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది. ఐతే ఇవి కేవలం ప్రతిపాదనలు మాత్రమే, ఇంకా ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు ఆమోదించలేదు.
ఇకపోతే SCలకు పలు నియోజికవర్గాలు రిజర్వ్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా SCలకు అసెంబ్లీ నియోజికవర్గాలు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 2014లో జరిగిన సాధారణ ఎన్నికల రిపోర్ట్ ప్రకారం ఆ ఎన్నికల్లో SCలకు ఏడు స్థానాలు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అంటే కేంద్రంలో మొదటిసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో SCలకు అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. ఇకపోతే ఇంతకుముందు STలకు ప్రత్యేకంగా స్థానాలు రిజర్వ్ చేసి లేవు కాని పలు నియోజికవర్గాలలో STలు ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు కూడా.
చివరగా, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ సీట్లలో SCలకు ముందునుండే రిజర్వేషన్ అమలులో ఉంది, STలకు రిజర్వ్ చేయాలన్న ప్రతిపాదన ఇంకా ప్రభుత్వ ఆమోదం పొందలేదు.