30 సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన హిందూ శరణార్థులను పరామర్శించి, వారి బాధలను తెలుసుకుంటున్న దృశ్యం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. అంతేకాదు, జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు కోసం నరేంద్ర మోదీ ముప్పై సంవత్సరాల క్రితం నిరాహారదీక్ష చేసినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 30 సంవత్సరాల క్రితం నరేంద్ర మోదీ, పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన హిందూ శరణార్థులను పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకుంటున్న దృశ్యం.
ఫాక్ట్ (నిజం): 1980వ దశాబ్దం మొదటి సంవత్సరాలలో నరేంద్ర మోదీ, ‘సంభాగ్ ప్రచారక్’ నిర్వహికుడిగా గుజరాత్ రాష్ట్రంలోని గ్రామాలని సందర్శించి అక్కడి ప్రజల కష్టాల గురించి తెలుసుకున్నట్టు నరేంద్ర మోదీ వెబ్సైటులో తెలిపారు. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని ఒక గ్రామ ప్రజలని నరేంద్ర మోదీ పరామర్శిస్తుండగా ఈ ఫోటోని తీసారు. ఈ ఫోటోలో నరేంద్ర మోదీ పరామర్శిస్తున్నది పాకిస్తాని హిందూ శరణార్ధులని ఎక్కడ రిపోర్ట్ అవలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటో నరేంద్ర మోదీ వెబ్సైటులో దొరికింది. నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలోని ఒక గ్రామంలోని ప్రజలను పరామర్శిస్తున్న పాత దృశ్యం అని ఈ ఫోటో వివరణలో తెలిపారు. ఈ వెబ్సైటులో తెలిపిన సమాచారం ప్రకారం, 1980వ దశాబ్దం మొదటి సంవత్సరాలలో జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత, నరేంద్ర మోదీ ‘సంభాగ్ ప్రచారక్’ నిర్వహికుడిగా గుజరాత్ రాష్ట్రంలోని గ్రామాలని సందర్శించి అక్కడి ప్రజల కష్టాల గురించి తెలుసుకున్నట్టు వెబ్సైటులో తెలిపారు. ఈ క్రమంలోనే గుజరాత్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో నరేంద్ర మోదీ ప్రజలను పరామర్శిస్తున్న సందర్భంలో ఈ ఫోటోని తీసినట్టు వెబ్సైటులో తెలిపారు.
ఇదే ఫోటోని మరికొన్ని వార్తా సంస్థలు తమ ఆర్టికల్స్‌లో ఇదే వివరణతో పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఫోటోలో నరేంద్ర మోదీ పరామర్శిస్తున్నది పాకిస్తాన్ దేశం నుండి వలస వచ్చిన హిందువులనని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా పాకిస్తాన్ దేశం నుండి భారత దేశానికి వలస వచ్చిన హిందువులకు సమాన హక్కులు కల్పిస్తామని వాగ్ధానం చేసారు. ఇటీవల, రాజస్తాన్ జోధ్‌పూర్ జిల్లలో నివసిస్తున్న పాకిస్తాన్ వలస హిందువులు, తమకు ఆధార్ కార్డు లేనందున కరోనా వాక్సినేషన్ ఇవ్వడం లేదని, ట్రావెల్ సర్టిఫికెట్ల ఆధారంగా వాక్సినేషన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
2019లో బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తరువాత బీజేపీ నాయకుడు రామ్ మాధవ్, ఆర్టికల్ 370 రద్దు కోసం నరేంద్ర మోదీ చేసిన పాత దీక్షకు సంబంధించిన ఫోటోని తన ట్విట్టర్ హేండిల్‌లో షేర్ చేసారు. ఈ ఫోటోలో నరేంద్ర మోదీ వెనుక ఉన్న బ్యానరుపై “370 హటావో, ఆటంక్వాద్ కో మిటావో, దేశ్ బచావో” అని హిందీ అక్షరాలలో రాసి ఉంది. రామ్ మాధవ్ షేర్ చేసిన ఈ ఫోటోకి సంబంధించి పబ్లిష్ ఆయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 1991-92 సమయంలో మురళీ మనోహర్ జోషి నేతృత్వంలో నిర్వహించిన ‘ఏకతా యాత్ర’లో భాగంగా నరేంద్ర మోది ఈ దీక్షలో పాల్గొన్నట్టు తెలిసింది.
చివరగా, ఈ ఫోటోలో నరేంద్ర మోదీ పరామర్శిస్తున్నది పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన హిందువులను కాదు.