Fake News, Telugu
 

కాంగ్రెస్ మాజీ MLA ఆసిఫ్ ఖాన్ పోలీసులతో వాదించిన ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది, మధ్య ప్రదేశ్‌లో కాదు.

0

మధ్యప్రదేశ్ లో రాహుల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక కాంగ్రెస్ MLA చేసిన *పాకిస్తాన్ జిందాబాద్* నినాదాన్ని ఆపబోయిన పోలీస్ తో వాళ్ల అనుచిత ప్రవర్తన చూడండి… దేశానికి కాంగ్రెస్ ఎప్పటికీ ప్రమాదమే’ అని చెప్తూ, కొందరు కాంగ్రెస్ కండువా ధరించిన వ్యక్తులు, ఒక గుంపు, పోలీసులతో వాదిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: మధ్య ప్రదేశ్‌లో రాహుల్ గాంధీ ఫ్రొగ్రాంలో భాగంగా ఒక కాంగ్రెస్ MLA ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తుండగా ఆపిన పోలీసులతో అనుచితంగా ప్రవర్తించాడు. 

ఫాక్ట్(నిజం):  ఈ సంఘటన నవంబర్ 2022లో ఢిల్లీలోని షాహీన్ భాగ్‌లో జరిగింది. మాజీ కాంగ్రెస్ MLA ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్ అనుమతి లేకుండా ఒక మీటింగ్ నిర్వహించినందుకు పోలీసలు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆసిఫ్ పోలీసు వారితో అనుచితంగా ప్రవర్తించారు. ఇందుకుగాను షాహీన్ భాగ్ పోలీసులు తనపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేసారు. కానీ పోస్టులో చెప్తున్నట్లుగా ఆసిఫ్ ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదం చేసినట్లు, పోలీసులు దాఖలు చేసిన FIRలో కానీ, ఈ సంఘటనపై వచ్చిన వార్తా కథనాల్లో కానీ ఎక్కడా పేర్కొనలేదు. వీడియోకి చెందిన ఆడియో సరిగ్గా పరిశీలిస్తే, అసిఫ్ ఖాన్ జిందాబాద్ అని ఆసిఫ్ అనుచరులు అంటున్నట్లు మనకి అర్థం అవుతుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న వాస్తవాల గురించి తెలుసుకోవటానికి ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతుకగా, ఈ సంఘటనకు సంబంధించిన అనేక వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు దొరికాయి, ఇవన్నీ నవంబర్ 2022 నాటివి.

కథనాల ప్రకారం, వీడియోలో పోలీసులతో దుర్భాషలాడుతూ, అనుచితంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి పేరు ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్. November 2022లో ఢిల్లీలోని షాహీన్ భాగ్ ప్రాంతంలో ఉన్న తయ్యబ్ మసీదు వద్ద అనుమతి లేకుండా ఆసిఫ్ నిర్వహించిన ఒక మీటింగును ఆపడానికి ప్రయత్నించిన పోలీసులపై ఆసిఫ్ విరుచుకుపడ్డారు. 

ఈ సంఘటన మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఎన్నికల ప్రచార సమయంలో జరిగింది, ఆసిఫ్ ఖాన్ కూతురు ఆరిబా ఖాన్ ఈ ఎన్నికల్లో అభ్యర్థి. తనకు మద్దతుగా ఆసిఫ్ ఈ మీటింగును నిర్వహించినట్లు వార్త కథనాలు పేర్కొన్నాయి. వీటిల్లో ఎక్కడా కూడా రాహుల్ గాంధీ ప్రోగ్రాం సందర్భంగా ఇది జరిగినట్లు లేదు. ఈ ప్రవర్తనకు గాను ఆసిఫ్ ఖాన్ మీద పోలీసులు 25 నవంబర్ 2022న కేస్ నమోదు చేసి అరెస్టు కూడా చేసారు (ఇక్కడ, ఇక్కడ). 

పోస్టులో చెప్తున్నట్లుగా ఈ సంఘటన జరిగినప్పుడు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అనే నినాదాలు ఆసిఫ్ కానీ తన అనుచరులు కానీ చేసినట్లు పోలీసులు నమోదు చేసిన FIRలో మరియు వార్తా కథనాల్లో ఎక్కడా కూడా పోరాస్తావించలేదు. ఇంకా, వైరల్ వీడియోలో ఆడియోను కనుక మనం క్షుణ్ణంగా వింటే, ఆసిఫ్ ఖాన్ అనుచరులు పాకిస్తాన్ జిందాబాద్ అని కాక ఆసిఫ్ ఖాన్ జిందాబాద్ అని అంటున్నట్లు స్పష్టం అవుతుంది. వైరల్ వీడియోను వార్త సంస్థలు తమ కథనాల్లో జోడించారు, వాటిని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు, వీటిల్లో కూడా పాకిస్తాన్ జిందాబాద్ అని కాక ఆసిఫ్ ఖాన్ జిందాబాద్ అని అంటున్నట్లు తెలుస్తుంది.  

చివరిగా, ఢిల్లీలో MCD ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మాజీ MLA ఆసిఫ్ ఖాన్ పోలీసులతో వాదించిన సంఘటన మధ్య ప్రదేశ్‌లో జరిగిందని, ఈ సంఘటనలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఆసిఫ్ చేసారని తప్పుడు కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll