Fake News, Telugu
 

అధికారిక లెక్కల ప్రకారం కేరళలో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 24 కాగా ఉత్తరప్రదేశ్‌లో 31గా ఉంది

0

కేరళ రాష్ట్రంలోని బడులలో సగటున పదిమంది విద్యార్ధులకు ఒక టీచర్ ఉంటే ఉత్తరప్రదేశ్లో డెబ్బై మంది విద్యార్ధులకు ఒక టీచర్ ఉన్నారని, కాబట్టి దేశానికి ఎలాంటి మోడల్ కావాలో చెప్పమని అడుగుతూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కేరళలోని బడులలో సగటున పదిమంది విద్యార్ధులకు ఒక టీచర్ ఉంటే ఉత్తరప్రదేశ్‌లో డెబ్బై మంది విద్యార్ధులకు ఒక టీచర్ ఉన్నారు.

ఫాక్ట్: విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2021-22 గణాంకాల ప్రకారం కేరళలో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 24 కాగా ఉత్తరప్రదేశ్‌లో అది 31గా ఉంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా దేశంలోని వివిధ బడులకు సంబంధించిన గణాంకాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 2021-22 నివేదికని పరిశీలించాం. ఈ నివేదిక ప్రకారం దేశంలోని అన్ని రకాల బడులను పరిగణలోకి తీసుకోగా, వాటిల్లో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి సగటున 28గా ఉంది. అంటే, 28 విద్యార్ధులకు సగటున ఒక టీచర్ ఉన్నారని అర్థం. అయితే ఈ నిష్పత్తి కేరళ రాష్ట్రంలో 24గా ఉంటే, ఉత్తరప్రదేశ్‌లో 31గా ఉంది. ఈ నిష్పత్తి తక్కువగా ఉండడం వలన ఒక ఉపాధ్యాయుడు తక్కువ మంది విద్యార్ధుల కోసం పనిచేస్తాడు కాబట్టి వారిపైన ఎక్కువ దృష్టి పెట్టడంతో బోధనా నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంటుందని ఈ నివేదిక వెల్లడించింది.

అన్ని రకాల బడులలోని విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి వివరాలు (2021-22)

రాష్ట్రంవిద్యార్ధుల సంఖ్య ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి
కేరళ64,23,1202,68,47324
ఉత్తర ప్రదేశ్4,71,81,43815,07,82831

అలాగే, కేవలం ప్రభుత్వ మరియు ఎయిడెడ్ బడులలో ఈ నిష్పత్తి వివరాలను పరిశీలించగా కేరళలో 21గా ఉంటే ఉత్తర ప్రదేశ్లో 33గా ఉంది.

ప్రభుత్వ& ఎయిడెడ్ బడులలోని విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి వివరాలు (2021-22)

రాష్ట్రంవిద్యార్ధుల సంఖ్య ఉపాధ్యాయుల సంఖ్య విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి
కేరళ40,90,5681,93,13421
ఉత్తర ప్రదేశ్2,39,43,4927,25,44433

పై గణాంకాలను బట్టి కేరళలో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి ఉత్తరప్రదేశ్ మరియు జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ పోస్టులో చెప్పిన విధంగా భారీ వ్యత్యాసం లేదని నిర్ధారించవచ్చు.

చివరిగా, కేరళలో విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి 24గా ఉంటే, ఉత్తరప్రదేశ్‌లో 31గా ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll