Fake News, Telugu
 

భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ముహమ్మద్ అలీ జిన్నా అని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనలేదు

0

భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ముహమ్మద్ అలీ జిన్నా అని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ముహమ్మద్ అలీ జిన్నా అని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నాడు.

ఫాక్ట్ (నిజం): సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో పాకిస్తాన్ జాతి పిత ముహమ్మద్ అలీ జిన్నాని భారత స్వాతంత్ర్య ఉద్యమకారులు సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రులతో పోల్చారు. వీరందరూ ఒకే విద్యాసంస్థలో చదువుకొని, బారిస్టర్ పట్టా పొంది, భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసారని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.  కానీ, భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ముహమ్మద్ అలీ జిన్నా అని అఖిలేష్ యాదవ్ అనలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన సమాచారం కోసం గుగూల్‌లో కీ పదాలు ఉపయోగించి వెతికితే, 31 అక్టోబర్ 2021 నాడు ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాకిస్తాన్ జాతి పిత ముహమ్మద్ అలీ జిన్నా ప్రస్తావన తెచ్చినట్టు తెలిసింది. అఖిలేష్ యాదవ్ తన ప్రసంగంలో ముహమ్మద్ అలీ జిన్నాని భారత స్వాతంత్ర్య ఉద్యమకారులు సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రులతో పోల్చినట్టు పలు న్యూస్ సంస్థలు వీడియోలని పబ్లిష్ చేసాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

‘ANI’ ట్వీట్ చేసిన వీడియోలో అఖిలేష్ యాదవ్, “సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ మరియు జిన్నా ఒకే విద్యాసంస్థలో చదువుకొని, బారిస్టర్ డిగ్రీ పట్టా పొంది, భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసారు”, అని అన్నాడు. అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కానీ, భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ముహమ్మద్ అలీ జిన్నా అని అఖిలేష్ యాదవ్ తన ప్రసంగంలో పేర్కొనలేదు. 1940లో లాహోర్ నగరంలో జరిగిన బహిరంగ సభలో ముస్లింల కోసం ఉపఖండంలో ప్రత్యేక దేశం కావాలనే నినాదాన్ని ముహమ్మద్ అలీ జిన్నా చేసి, దేశ విభజనకి ముఖ్య కారణం అయ్యారు. ముస్లింల కోసం ప్రత్యేక దేశం కావాలనే ఉద్దేశంతోనే జిన్నా బ్రిటిష్ పరిపాలన నుండి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసారని అనే వాళ్ళు కూడా ఉన్నారు.

అఖిలేష్ యాదవ్, ముహమ్మద్ అలీ జిన్నాని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలని బీజేపి నాయకులతో పాటు, AIMIM అధినేత అసదుద్ధిన్ ఒవైసీ కూడా ఖండించారు. అసదుద్ధిన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ, “మహమ్మద్ అలీ జిన్నాతో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని అఖిలేష్ యాదవ్ అర్థం చేసుకోవాలి. మా పెద్దలు రెండు దేశాల సిద్ధాంతాన్ని తిరస్కరించి భారతదేశాన్ని మాత్రమే తమ దేశంగా ఎంచుకున్నారు”, అని తెలిపారు.

చివరగా, భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ముహమ్మద్ అలీ జిన్నా అని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll