Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియోని పుంగనూరు సదం ప్రాజెక్టు నీటిలో 200 కేజీల భారీ చేప సంచరిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

చిత్తూరు జిల్లా పుంగనూరు సదం ప్రాజెక్టు నీటిలో 200 కేజీల భారీ చేప సంచరిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఈ భారీ చేప చిత్తూరు రంగసముద్రం చెరువులో కనిపించినట్టు మరొక యూట్యూబ్ యూసర్ క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: చిత్తూరు జిల్లా పుంగనూరు సదం ప్రాజెక్టు నీటిలో 200 కేజీల భారీ చేప సంచరిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో గత కొన్నేళ్లుగా వేరు వేరు ప్రాంతాలకు జత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న భారీ చేప, మహబూబ్‌నగర్ జిల్లా కోయిలా సాగర్ ప్రాజెక్ట్ నదిలో కనిపించిందని తెలుగు యూట్యూబ్ ఛానల్స్, ఒడిశా హిరాకుద్ డ్యాం నీటిలో కనిపించిందని మరికొన్ని ఒడిశా న్యూస్ ఛానల్స్, గత సంవత్సరం సోషల్ మీడియాలో షేర్ చేసాయి. ఈ వీడియో పుంగునూరు సదం ప్రాజెక్టుకు సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలు గత కొన్నేళ్లుగా వేరు వేరు ప్రాంతాలకు జత చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. పోస్టులో షేర్ చేసిన ఈ వీడియోని CMTV న్యూస్ ఛానల్ 22 జూలై 2020 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్ సాగర్ డ్యాంలో అతిపెద్ద సొరచేప సంచరిస్తున్న దృశ్యాలని వీడియో వివరణలో తెలిపారు. ఈ భారీ చేప కృష్ణా నదిలో కనిపించిందని ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు పబ్లిష్ చేసాయి. ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

అయితే, ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ ఇంటర్నెట్లో ఏ ఒక్క ప్రముఖ వార్తా సంస్థ ఆర్టికల్ పబ్లిష్ చేయలేదు. ఈ భారీ చేప ఒడిశా హిరాకుద్ డ్యాం నీటిలో కనిపించిందని ఒడిశా న్యూస్ సంస్థలు 2020 ఆగష్టు నెలలో వీడియోలు, ఆర్టికల్ పబ్లిష్ చేసాయి. మరికొన్ని వార్తా సంస్థలు, ఈ చేప వికారాబాద్ కొటేపల్లీ డ్యాం నీటిలో కనిపించిందని రిపోర్ట్ చేసారు.

అంతేకాదు, ఈ భారీ చేప తమిళనాడు మేట్టుర్ జిల్లాలో కనిపించిందని తమిళ న్యూస్ సంస్థ ‘PuthiyathalaimuraiTV’ 11 ఆగష్టు 2020 నాడు వీడియోని పబ్లిష్ చేసింది. పోస్టులో షేర్ చేసిన వీడియో ఎక్కడ తీసారన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, ఈ వీడియో పాతదని, చిత్తూరు జిల్లా పుంగునూరు సదం ప్రాజెక్టు నదిలో ఇటీవల తీయలేదని ఈ వివరాల ఆధారంగా కచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, సంబంధం లేని పాత వీడియోని పుంగనూరు సదం ప్రాజెక్టు నీటిలో ఇటీవల 200 కేజీల భారీ చేప సంచరిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll