Fake News, Telugu
 

గత సంవత్సరం మెక్సికో వరదల్లో పశువులు కొట్టుకుపోతున్న వీడియోని ప్రస్తుతం తిరుపతి వరదలకు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి, పలు చోట్ల రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే వరద నీటి ప్రవాహంలో పశువులు కొట్టుకుపోతున్న ఒక వీడియోని తిరుపతిలో వరదలకి పశువులు కట్టుకపోతున్నాయంటూ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాలకు పశువులు కొట్టుకపోతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని దృశ్యాలు జులై 2020లో మెక్సికోలోని నయారిట్‌ రాష్ట్రంలో సంభవించిన హన్నా తుఫాను దాటికి ఆవులు వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించినవి. ఇపుడు తిరుపతిలో కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రోడ్లు, బ్రిడ్జీలు, ఇళ్ళు కూడా కొట్టుకపోయినప్పటికీ, ఈ వీడియోకి తిరుపతికి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని ‘Imagen TV’ అనే మెక్సికన్ వార్తా సంస్థ 28 జులై 2020న ‘Imagen Noticias’ అనే కార్యక్రమంలో రిపోర్ట్ చేసిన కథనం మాకు కనిపించింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఇవి నయారిట్ రాష్ట్రంలోని జాకుల్పాన్ నదిలో పశువులు కొట్టుకుపోయిన ఘటనకి సంబంధించిన దృశ్యాలు.

28 జులై 2020న ‘UNO TV’ అనే మరొక న్యూస్ పోర్టల్ మెక్సికోలోని నయారిట్ రాష్ట్రంలో ‘హన్నా తుఫాను’ దాటికి పశువులు కొట్టుకుపోయాయంటూ ఇదే వీడియోని రిపోర్ట్ చేసింది.

ఇదే వీడియోని గతంలో తెలంగాణలోని వికారాబాద్‌కి, మధ్యప్రదేశ్‌కి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన సందర్భాలలో FACTLY ఆ క్లెయిమ్స్ తప్పని చెప్తూ రాసిన కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, గత సంవత్సరం మెక్సికో వరదల్లో పశువులు కొట్టుకుపోతున్న వీడియోని ప్రస్తుతం తిరుపతి వరదలకు ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll