Fake News, Telugu
 

ద్విచక్ర వాహనం విక్రయించేటప్పుడు హెల్మెట్ అందించాలనే నిబంధన ఉన్నప్పటికీ, అది ఉచితంగా అందించాలా లేక చార్జీ వసూలు చేయాలా అన్న విషయంపై స్పష్టత లేదు

0

‘కేంద్ర చట్టం ప్రకారం బైక్ కొన్నప్పుడు తప్పనిసరి రెండు హెల్మెట్లు ఫ్రీగా వస్తాయని’ రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఇదే వార్తని తెలుగులోని అనేక ప్రధాన వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘కేంద్ర చట్టం ప్రకారం బైక్ కొన్నప్పుడు తప్పనిసరి రెండు హెల్మెట్లు ఫ్రీగా వస్తాయి’.

ఫాక్ట్ (నిజం): మోటార్ వెహికల్ రూల్స్‌లోని సెక్షన్ 138(4)(f)లో ద్విచక్ర వాహనం విక్రయించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా అందించాలనే నిబంధన ఉన్నప్పటికీ, ఈ హెల్మెట్ కి చార్జీ వసూలు చెయాలా లేక ఉచితంగా అందించాలా అన్న విషయంపై స్పష్టత లేదు. ఈ సెక్షన్ అమలుకు సంబంధించిన ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పులో హెల్మెట్ అందించే విషయంలో వాహన తయారీదారులు, డీలర్లు ఒక ఒప్పందానికి రావాలని చెప్పింది. కొన్ని రాష్ట్రాలలో డీలర్లు హెల్మెట్లను ఉచితంగా ఇస్తుంటే, కొన్ని రాష్ట్రాలలో చార్జీ వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రలలో డీలర్లు వాహనం విక్రయించేటప్పుడు హెల్మెట్ అందించాలనే నిబంధనను అమలు చేయట్లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఏదైనా ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో, ద్విచక్ర వాహన తయారీదారు BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) మార్క్ హెల్మెట్ ని  తప్పనిసరిగా సరఫరా చేయాలని సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989 లోని సెక్షన్ 138(4)(f)లో పేర్కొన్నారు.

ఐతే ఇటీవల ఒక ట్విట్టర్ వినియోగదారుడు ఈ రూల్ ప్రకారం షో రూమ్ లో హెల్మెట్ అడిగితే, షోరూం వాళ్ళు హెల్మెట్ ని కొనుక్కోవాలని చెప్పారని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సైబెరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ కి స్పందిస్తూ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1988 సెక్షన్ 138(4)(f) ప్రకారం పౌరులు తాము కొనుగోలు చేసే మోటార్ సైకిల్‌తో పాటుగా రెండు హెల్మెట్‌లను క్లెయిమ్ చేయమని విజ్ఞప్తి చేసారు.

సైబెరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చేసిన ఈ ట్వీట్ నేపథ్యంలోనే పైన తెలిపిన తెలుగు వార్తా పత్రికలు మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారం బైక్ కొన్నప్పుడు రెండు హెల్మెట్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్తూ కథనాలు రాసాయి. నిజానికి సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1988 సెక్షన్ 138(4)(f)లో వినియోగదారుడికి హెల్మెట్లు అందించాలి అని ఉంది గాని, ఈ హెల్మెట్లను వినియోగదారుడు డబ్బులిచ్చి కొనుక్కొవాలా లేదా ఫ్రీగా అందిస్తారా అన్న విషయంపై ఎటువంటి స్పష్టత లేదు.

ఐతే గతంలో ఈ సెక్షన్ 138(4)(f) రద్దు చేయాలని హెల్మెట్ తయారీదారుల అసోసియేషన్, ఈ సెక్షన్ ని పటిష్టంగా అమలు చేయాలని సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ డెవలప్మెంట్ అనే స్వచంధ సంస్థ ఢిల్లీ హై కోర్టులో రెండు వేరువేరు పిటిషన్లను దాఖలు చేసాయి. రెండు పిటిషన్లను కలిపి విచారించిన ఢిల్లీ హై కోర్టు, ఈ రూల్ ని ప్రమాదాలను నివారించాలానే ఉద్దేశంతో రూపొందించారని కావున ఈ రూల్ కొనసాగుతుందని, కాకపోతే అమలు విషయంలో వాహన తయారీదారులు మరియు డీలర్లు ఒక ఒప్పందానికి రావాలని చెప్పింది. ఈ తీర్పులో కూడా కోర్టు ఈ హెల్మెట్లను వినియోగదారుడు డబ్బులిచ్చి కొనుక్కొవాలా లేదా ఫ్రీగా అందిస్తారా అన్న విషయంపై ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు.

అంతే కాదు, 2005లో ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం రాసిన లెటర్ లో కూడా హెల్మెట్ రకం, ధర తయారీదారు/డీలర్ మరియు వాహనం కొనుగోలుదారుడు పరస్పరం మాట్లాడుకొని నిర్ణయం తీసుకోవాలని ఉంది.

ఆ తరువాత, చాలా రాష్ట్రాల హై కోర్టులలో ఈ సెక్షన్ 138(4)(f) అమలుపై వాదనలు జరగగా, కోర్టులు ఈ సెక్షన్ ని అమలు చేయాలని తీర్పులు చెప్పాయి. ఐతే కోర్టులు మాత్రం హెల్మెట్లు కొనాలా లేదా ఉచితమా అన్న విషయంపై మౌనంగానే ఉన్నాయి. ఈ తీర్పుల అనుగుణంగా ఆయా రాష్ట్రాలలోని రవాణా శాఖ వాహనాలు అమ్మేటప్పుడు హెల్మెట్లు కూడా ఇవ్వాలని డీలర్లకు ఆదేశాలు ఇవ్వగా, కొన్ని రాష్ట్రాలలో డీలర్లు హెల్మెట్లను ఉచితంగా ఇస్తుంటే, కొన్ని రాష్ట్రాలలో చార్జీ వసూలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రలలో డీలర్లు వాహనం విక్రయించేటప్పుడు హెల్మెట్ అందించాలనే నిబంధనను అమలు చేయట్లేదు. ఉదాహారణకి ఈ వార్తా కథనం ప్రకారం కేరళలో హై కోర్టు ఆర్డర్ నేపథ్యంలో డీలర్లు హెల్మెట్‌ని ఉచితంగా ఇస్తుంటే, మహారాష్ట్రలో మాత్రం చార్జీ వసూలు చేస్తున్నారు.

గతంలో రాజస్తాన్‌లో కూడా ఇదే నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడి డీలర్లు నిరసన తెలిపారు. తమిళనాడులో కూడా ఈ నిర్ణయాన్ని పలువురు డీలర్లు వ్యతిరేకించారు. ఐతే ఇటీవల రాజస్తాన్‌లో మరియు ఓడిశా రాష్ట్రాలలో వాహనాలు విక్రయించేటప్పుడు హెల్మెట్లను కూడా అందించాలని ఆయా రాష్ట్ర రవాణా శాఖలు డీలర్లకు ఆదేశాలు ఇచ్చాయి.

పైన తెలిపిన వివరాల బట్టి వాహానాలు కొనేటప్పుడు హెల్మెట్లు ఉచితంగా అందిస్తారో లేక డబ్బులిచ్చి కొనుక్కోవాలో అన్న విషయంపై చట్టంలోగాని లేక కోర్టు తీర్పులలోగాని స్పష్టతలేదని, ఐతే కొన్ని కొన్ని రాష్ట్రాలలో డీలర్లు హెల్మెట్లను ఉచితంగా ఇస్తుంటే, కొన్ని రాష్ట్రాలలో చార్జీ వసూలు చేస్తున్నారని, మరికొన్ని రాష్ట్రాలలో ఈ నిబంధనని అమలు చేయట్లేదని అర్ధంచేసుకోవచ్చు.

చివరగా, ద్విచక్ర వాహనం విక్రయించేటప్పుడు హెల్మెట్ అందించాలనే నిబంధన ఉన్నప్పటికీ, ఈ హెల్మెట్ కి చార్జీ వసూలు చెయాలా లేక ఉచితంగా అందించాలా అన్న విషయంపై స్పష్టత లేదు.

Share.

About Author

Comments are closed.

scroll