Fake News, Telugu
 

తమిళనాడుకు సంబంధించిన పాత వీడియోని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఇటీవల రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. సమాజాన్ని 2 కిలోల బియ్యం, ఉచిత కరెంటు కోసం అమ్మితే వేల సంవత్సరాల నాటి మన సంస్కృతి, నాగరికత నాశనమైపోతాయని, ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతోందని పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలోని హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్న ఇటీవల దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): 2022 జనవరి నెలలో తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలోని వరదరాజపురం ప్రాంతంలో అడయార్ నదిని ఆక్రమించి కట్టారన్న ఆరోపణ మీద ఆంజనేయర్ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Polimer News’ వార్తా సంస్థ 11 జనవరి 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలోని తాంబరం ప్రాంతంలో అడయార్ నదిగర్భాన్ని ఆక్రమించి అక్రమంగా కట్టిన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ అధికారులు కూల్చివేసీన దృశ్యాలంటూ ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపుతూ ‘DT Next’ అనే వార్తా సంస్థ 11 జనవరి 2022 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసింది. చెన్నై నగరం తాంబరం సమీపంలోని వరదరాజపురం ప్రాంతంలో అడయార్ నదిగర్భాన్ని ఆక్రమించి అక్రమంగా కట్టిన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ రెవెన్యూ అధికారులు తాంబరం అసిస్టెంట్ కమీషనర్ నేతృత్వంలో పోలీసు బలగాల సహాయంతో కూల్చివేసినట్టు ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇతర వార్తా సంస్థలు 2022లో పబ్లిష్ చేసిన వార్తా కథానాలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అడయార్ నదిని ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు ఒక చర్చిని మరియు కొన్ని కమర్షియల్ భవనాలను కూడా కూల్చివేసినట్టు తాంబరం పోలీస్ కమిషనర్ ఒక  ప్రెస్ నోట్ విడుదల చేశారు. మద్రాసు హైకోర్టు 2015లో ఇచ్చిన ఆదేశాలానుసారంగానే ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలను నిర్వహించినట్టు తాంబరం కమిషనర్ స్పష్టం చేశారు.

ఇదివరకు, ఈ వీడియోని షేర్ చేస్తూ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అక్కడి హిందూ దేవలయాలను కూల్చివేస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫాక్ట్‌లీ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, తమిళనాడుకు సంబంధించిన పాత వీడియోని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll