పశ్చిమబెంగాల్ లో హిందూ మహిళలపై జరుగుతున్న దురాగతాలు అని చెప్తూ ఉండే పోస్ట్ ఒకటి సోషల్ మీడియా లో చాల వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో ఈ కధనం ద్వారా చూద్దాం.
క్లెయిమ్: బెంగాల్ లో హిందూ మహిళల పైన జరుగుతున్న దురాగతాలకు సంబంధించిన ఫొటోలు.
ఫాక్ట్ (నిజం): భోజ్ పూరి సినిమా లోని ఒక సన్నివేశానికి సంబంధించిన ఫోటోని మరియు 2017లో ట్విట్టర్ లో షేర్ అయిన కొన్ని పాత ఫోటోలని, బెంగాల్ లో హిందూ మహిళల దుస్తితిగా ప్రచారం చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పేది తప్పు.
ఫోటో 1:
పోస్ట్ లో ఉన్న ఫొటో ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పోస్ట్ లో ఒక మహిళ చీర లాగుతున్నట్టుగా ఉన్న ఫోటో ‘aurat khilona Nahi’ అనే ఒక భోజ్ పూరి సినిమా లోని సన్నివేశం లోనిదని తెలిసింది. 2017లో బెంగాల్ కు చెందిన బాబాతోష్ చట్టేర్జి అనే వ్యక్తి బెంగాల్ లో జరుగుతున్న మతఘర్షణల ఫోటో అని చెప్తూ ఈ ఫోటో తన ఫేస్ బుక్ ఎకౌంటు లో షేర్ చేసాడు. ఐతే తప్పుడు సమాచారం ద్వారా మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించినందుకుగాను పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసిన వార్త ఇక్కడ చదవచ్చు.
ఫోటో 2:
పోస్ట్ లో చేయి నరికివేసినట్టుగా ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2017లో ఉత్తర ప్రదేశ్ లోని సహరన్పూర్ లో దళితులకు, ఠాకూర్లకు మధ్యలో జరిగిన గొడవలకి సంబంధించిందని చాలామంది ట్విట్టర్ లో 2017లో షేర్ చేసారు. కొన్ని న్యూస్ పోర్టల్స్ కూడా అదే విషయాన్నీ ప్రచురించాయి. ఆ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే 2017లో ఉత్తర ప్రదేశ్ లో ఘర్షణలు జరిగిన విషయం వాస్తవమే అయినా, ఈ ఫొటో ఆ ఘర్షణలకు సంబంధించినదని ఖచ్చితంగా చెప్పగల ఆధారాలేవీ దొరకలేదు.
ఫోటో 3:
ఇక మూడో ఫోటో ని కూడా గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా 2017లో ఈ ఫోటోని #justiceforpriya అని చాలామంది ట్వీట్ చేసారుగాని ఆ ఫోటో గురించి మాకు ఖచ్చితమైన సమాచారం దొరకలేదు.
చివరగా, సంబంధం లేని పాత ఫోటోలను పోస్ట్ చేసి, బెంగాల్ లో హిందూ మహిళలపై జరుగుతున్న దురాగతాలుగా ప్రచారం చేస్తున్నారు.