Fake News, Telugu
 

సంబంధం లేని పాత ఫోటోని బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా సోదరి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్నట్టు షేర్ చేస్తున్నారు

0

ఢిల్లీలో హిందూ ముస్లిం మతాల మధ్య అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టిన బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా యొక్క సోదరి షాహాద్ అలీ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది, అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా సోదరి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): 2016లో కర్ణాటక రాష్ట్రం మైసూరులో ముస్లిం మతానికి చెందిన షకీల్ అహ్మద్, హిందూ మతానికి చెందిన ఆశీతాను వివాహం చేసుకున్నాడు. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఈ వివాహానికి సంబంధించినదే. లవ్ జిహాద్ పేరుతో కొన్ని వర్గాలు వారి వివాహాన్ని వ్యతిరేకిస్తుండటంతో షకీల్ అహ్మద్ మరియు ఆశీతా పోలీసు సెక్యూరిటీ మధ్య మైసూరులో వివాహం చేసుకున్నారు. ఈ ఫోటోకి బీజేపీ నాయకూడు కపిల్ మిశ్రాకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘The Hindu’ వార్తా సంస్థ 18 ఏప్రిల్ 2016 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. కర్ణాటక రాష్ట్రం మాండ్యాకు చెందిన షకీల్ అహ్మద్, ఆశీతా అనే ప్రేమికులు కుటుంబ సమక్షంలో పోలీసు సెక్యూరిటీ మధ్య మైసూరులో వివాహం చేసుకున్నారంటూ ఈ ఫోటోని షేర్ చేస్తూ ‘The Hindu’ రిపోర్ట్ చేసింది.

ముస్లిం మతానికి చెందిన షకీల్ అహ్మద్, హిందూ మతానికి చెందిన ఆశీతా అలియాస్ శేష్టను పెళ్లిచేసుకోవడానికి మాండ్యాలోని కొన్ని వర్గాలు అడ్డు చెప్పడంతో 17 ఏప్రిల్ 2022 నాడు మైసూరులో పోలీసు సెక్యూరిటీ మధ్య వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి సంబంధించి NDTV వార్తా సంస్థ 2016 ఏప్రిల్ నెలలో పబ్లిష్ చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.

షకీల్ అహ్మద్ ఆశీతాల వివాహానికి సంబంధించి 2016లో పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. కపిల్ మిశ్రా సోదరి ముస్లిం వ్యక్తిని వివాహమాడినట్టు ఈ ఫోటోని 2021 నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన సోదరి వివాహానికి సంబంధించి షేర్ చేస్తున్న ఈ ఫోటోపై కపిల్ మిశ్రా ‘Boom Live’ వారితో మాట్లాడుతూ, “నాకు మొత్తంగా ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అందులో ఇద్దరి పెళ్లిళ్ళు జరిగాయి. నా చెల్లెళ్లు గానీ దూరపు బంధువులు ఎవరూ గానీ ముస్లిం వ్యక్తిని పెళ్లిచేసుకోలేదు”, అని తెలిపారు.

చివరగా, సంబంధం లేని పాత ఫోటోని షేర్ చేస్తూ బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా సోదరి ముస్లిం యువకుడిని ఇటీవల పెళ్లి చేసుకున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll