Fake News, Telugu
 

దేశంలో పలు యూనివర్సిటీలు చాలా సంవత్సరాల నుండే భగవద్గీతపై కోర్సులు అందిస్తున్నాయి

0

ప్రభుత్వ సొమ్ముతో ఖురాన్ బోధించడానికి భారతదేశంలో 20 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కానీ భగవద్గీత, రామాయణం బోధించడానికి ఒక్కటి కూడా లేదని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: ఖురాన్ బోధించడానికి భారతదేశంలో 20 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కానీ భగవద్గీత, రామాయణం బోధించడానికి ఒక్కటి కూడా లేదు.

ఫాక్ట్(నిజం): దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు ఖురాన్‌కు సంబంధించిన కోర్సులు అందిస్తున్న విషయం నిజమే అయినప్పటికీ, పలు విశ్వవిద్యాలయాలు భగవద్గీతపై కూడా కోర్సులు అందిస్తున్నాయి. ఉదాహరణకు కురుక్షేత్ర యూనివర్సిటీ, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, వంటి విద్యాసంస్థలు భగవద్గీతపై కోర్సులు అందిస్తున్నాయి. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

దేశంలో జామియా మిలియా ఇస్లామియా, మొహమ్మద్ అలీ జౌహర్, మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం వంటి పలు విశ్వవిద్యాలయాలు తమ ఇస్లామిక్ స్టడీస్‌కు సంబంధించిన ప్రణాళికలో భాగంగా ఖురాన్‌ను భోదిస్తున్నాయి. ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న పోస్టులో చెప్తున్నట్టు భగవద్గీత/రామాయణం  బోధించే విశ్వవిద్యాలయాలు లేవు అనడం అతిశయోక్తి అవుతుంది.

ఎందుకంటే దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు భగవద్గీతపై కోర్సులు అందిస్తున్నాయి. ఉదాహారణకు కురుక్షేత్ర యూనివర్సిటీ 2012లోనే గీతపై కోర్సును ప్రవేశపెట్టింది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ భగవద్గీతపై పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ప్రోగ్రాం, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ కూడా అంతకు ముందు నుండే  భగవద్గీతపై కోర్సును అందిస్తూ ఉన్నాయి.

ఇటీవల లుక్నౌ యూనివర్సిటీతో పాటు మరికొన్ని యూనివర్సిటీలు కూడా భగవద్గీతపై కోర్సులు ప్రవేశపెట్టాయి. గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలు భగవద్గీతను తమ స్కూల్ పాఠ్యాంశాలలో చేర్చాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ విధానంలో భగవద్గీత ఇప్పటికే వివిధ తరగతులలో బోధించబడుతోందని, కావాలంటే రాష్ట్రాలు భగవద్గీతను తమ పాఠ్యాంశాలలో జోడించవచ్చు అని ఈ మధ్య కాలంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పార్లమెంట్‌లో తెలిపారు. వీటన్నిటి బట్టి దేశంలో భగవద్గీత బోధించే విద్యాలయాలు లేవు అన్న వ్యాఖ్యలు కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.

చివరగా, దేశంలో పలు యూనివర్సిటీలు చాలా సంవత్సరాల నుండే భగవద్గీతపై కోర్సులు అందిస్తున్నాయి.

Share.

About Author

Comments are closed.

scroll