Fake News, Telugu
 

నరేంద్ర మోదీని ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తిస్తూ టర్కీ ఎటువంటి పోస్టల్ స్టాంప్ ముద్రించలేదు

0

టర్కీ ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో తమ దేశంలో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ముద్రించింది అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. నరేంద్ర మోదీని ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తిస్తూ టర్కీ ఈ పోస్టల్ స్టాంప్ ముద్రించిందని పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నరేంద్ర మోదీని ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తిస్తూ, టర్కీ మోదీ చిత్రంతో ప్రత్యేక  పోస్టల్ స్టాంపుని ముద్రించింది.

ఫాక్ట్: 2015లో టర్కీ దేశంలో జరిగిన G20 అంటాల్య స‌ద‌స్సు గుర్తుగా టర్కీ అధ్యక్షుడు ఏర్దోగాన్ G20 నాయకుల చిత్రాలతో రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంపులని విడుదల చేసారు. నరేంద్ర మోదీ చిత్రం కలిగి ఉన్న పోస్టల్ స్టాంపుతో సహా ఇతర G20 నాయకుల పోస్టల్ స్టాంపులని కూడా G20 స‌ద‌స్సు గుర్తుగా టర్కీ రూపొందించింది. నరేంద్ర మోదీని ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తిస్తూ టర్కీ ఎటువంటి ప్రత్యేక పోస్టల్ స్టాంపుని ముద్రించలేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌కి సంబంధించిన వివరాల కోసం కొన్ని పదాలను ఉపయోగించి వెతికితే, టర్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీ చిత్రంతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ముద్రించిన విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు 2015 నవంబర్ నెలలో ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. 15 నవంబర్ 2015 నాడు టర్కీలో జరిగిన G20 అంటాల్య స‌ద‌స్సులో నరేంద్ర మోదీ చిత్రంతో రూపొందించిన ఒక ప్రత్యేక పోస్టల్ స్టాంపుని విడుదల చేసినట్టు ఈ వార్తా సంస్థలు తెలిపాయి. 2.80 టర్కిష్ లిరా స్టాంపుపై నరేంద్ర మోదీ చిత్రాన్ని అలాగే భారత జాతీయ జెండాను ముద్రించారని ఇందులో తెలిపారు. G20 అంటాల్య స‌ద‌స్సు గుర్తుగా టర్కీ ప్రభుత్వం G20 నాయకుల చిత్రాలతో ప్రత్యేక పోస్ట్ స్టాంపులని రూపొందించినట్టు ఈ వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి.  

G20 నాయకుల చిత్రాలతో ‘ది టర్కిష్ పోస్ట్’ సంస్థ రూపొందించిన ఈ ప్రత్యేక పోస్ట్ స్టాంపుల ఫోటోని ‘G20 టర్కీ’ ట్విట్టర్ హ్యాండిల్ 18 నవంబర్ 2015 నాడు ట్వీట్ చేసింది. ఈ ఫోటోలో నరేంద్ర మోదీ చిత్రం కలిగిన పోస్టల్ స్టాంపుతో సహా ఇతర G20 నాయకుల చిత్రాల పోస్ట్ స్టాంపులని కూడా చూడవచ్చు.

G20 అంటాల్య స‌ద‌స్సు సందర్భంగా టర్కీ రూపొందించిన ఈ ప్రత్యేక స్టాంపులకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, నరేంద్ర మోదీని ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా గుర్తిస్తూ టర్కీ ప్రభుత్వం తమ దేశంలో ఎటువంటి పోస్టల్ స్టాంప్ ముద్రించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll