ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం తిరుమల స్పెషల్ దర్శనం టికెట్ రేట్లు తగ్గించిందన్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. గతంలో రూ. 300 ఉన్న స్పెషల్ దర్శనం టికెట్ ధరను రూ. 200కు తగ్గించారని, అలాగే లడ్డూ ధర రూ. 50 నుండి రూ. 25కు తగ్గించారంటూ వార్తలు షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ విషయానికి సంబంధించి నిజామెంటో తెలుసుకుందాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల స్పెషల్ దర్శనం, లడ్డూ ధరలను తగ్గించింది.
ఫాక్ట్(నిజం): ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని TTD స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ధర రూ. 300, లడ్డూ ధర రూ. 50 యధాతధంగా ఉన్నాయని తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల దర్శనం టిక్కెట్ రేట్లు, లడ్డూ ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. తిరుమలలో లడ్డూ ధరలను తగ్గించారంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై TTD క్లారిటీ ఇచ్చింది. ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలలో కూడా ఎటువంటి మార్పు లేదని ట్విట్టర్ ద్వారా పేర్కొంది.
ప్రస్తుతానికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ధర రూ.300, లడ్డూ ధర రూ.50 యధాతధంగా ఉన్నాయని తెలిపింది. సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డు ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలను టీటీడీ సవరించినట్లు వస్తూన్న వార్తలు అవాస్తవమని భక్తులకు గమనించాలని కోరింది.
ఇదే విషయాన్నీ పలు వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేసాయి. ఈ కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇంతకుముందు కూడా ఇలానే కొత్త ప్రభుత్వం వయోవృద్ధుల దర్శనానికి రెండు స్లాట్‌లు ఏర్పాటు చేసిందని వార్తలు సోషల్ మీడియాలో షేర్ అయినప్పుడు FACTLY దీనిని ఫాక్ట్-చెక్ చేస్తూ రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.
చివరగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని TTD స్పష్టం చేసింది.