Fake News, Telugu
 

యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి ప్రజలు తమ మద్దతు లేదా అసమ్మతిని తెలియజేయడానికి భారత ప్రభుత్వం ఎటువంటి ఫోన్ నంబర్‌ను జారీ చేయలేదు

0

బీజేపీ తన 2024 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు చేస్తామని పేర్కొంది. ఇటీవల ముగిసిన 2024 లోక్‌సభ ఎన్నికలలో, BJP నేతృత్వంలోని NDA కూటమి మెజారిటీ MP సీట్లను గెలుచుకుంది, నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే భారతదేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి)ని అమలు చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని, ఇందుకోసం దేశ పౌరులు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు, ఇప్పటికే రెండు రోజుల్లో 04 కోట్ల మంది ముస్లింలు, 02 కోట్ల మంది క్రైస్తవులు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాబట్టి గడువుకు ముందే అంటే 06 జూలై 2024 తేదీలోపు దేశంలోని హిందువులందరూ UCCకి అనుకూలంగా ఓటు వేసి దేశాన్ని రక్షించండి, దయచేసి ‘9090902024’కు మిస్డ్ కాల్ ఇవ్వండి అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: యూనిఫాం సివిల్ కోడ్‌(UCC)కు తమ మద్దతును తెలియజేయాలనుకునే హిందువులు 06 జూలై 2024 లోపు ‘9090902024’కి మిస్డ్ కాల్ ఇవ్వాలి.

ఫాక్ట్(నిజం): యూనిఫాం సివిల్ కోడ్‌కు ప్రజలు తమ మద్దతును లేదా వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి భారత ప్రభుత్వం ఎటువంటి మిస్డ్ కాల్ నంబర్‌ను ప్రారంభించలేదు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ వెబ్‌సైట్‌లో లేదా లా కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇ-మెయిల్ పంపడం ద్వారా UCCపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. అంతేకాకుండా, ‘9090902024’ నంబర్ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం BJP ప్రారంభించిన ప్రచారానికి సంబంధించింది. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనకు ప్రజలు తమ మద్దతును తెలియజేయడానికి ‘9090902024′ అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరుతూ బీజేపీ ఈ నంబర్‌ను మే 2023న ప్రారంభించింది. ప్రస్తుతం ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినప్పుడు ఎటువంటి స్పందన రావడం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ క్లెయిమ్‌కు సంబంధించిన సమాచరం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, మే 2023లో పబ్లిష్ అయిన పలు వార్తకథనాలు లభించాయి.(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహకంగా బీజేపీ ప్రారంభించిన ‘జన్ సంపర్క్ సే జన్ సమర్ధన్’ అనే ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సంబంధించినది అని తెలుస్తుంది. తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనకు తమ మద్దతును తెలియజేయడానికి ‘9090902024′ అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ఈ  ప్రచారంలో భాగంగా ప్రజలను కోరినట్లు ఈ వార్తాకథనాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ తమ అధికారిక వెబ్సైటులో పబ్లిష్ చేసిన పత్రికా ప్రకటనలో కూడా పేర్కొన్నది.

అలాగే బీజేపీ తమ అధికారిక X(ట్విట్టర్)లో కూడా తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనకు ప్రజలు తమ మద్దతును తెలియజేయడానికి ‘9090902024′ అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతూ పోస్ట్ చేసింది. మేము కూడా ‘9090902024’ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా దీనిని పరీక్షించాము. కానీ మాకు ఎటువంటి స్పందన రావడం లేదు.

అంతేకాకుండా UCCకి సంబంధించి ప్రసారం అవుతున్న తప్పుడు వాట్సాప్ టెక్స్ట్, మెసేజ్‌లు మరియు కాల్‌లకు వ్యతిరేకంగా ప్రజలను హెచ్చరిస్తూ  07 జూలై 2023న లా కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పత్రిక ప్రకటన జారీ చేసింది. అలాగే, లా కమిషన్ ఆఫ్ ఇండియాకు(membersecretary-lci@gov.in) ఇమెయిల్ పంపడం ద్వారా యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు అని చెప్తూ లా కమిషన్ ఆఫ్ ఇండియా 14 జూన్ 2023న యూనిఫాం సివిల్ కోడ్‌పై పబ్లిక్ నోటీసును జారీ చేసిందని, కమిషన్ అధికారిక మార్గాల ద్వారా మాత్రమే కమ్యూనికేట్ చేస్తుందని పేర్కొంది.  

ఇదే పోస్టు జూన్ 2023లో వైరల్ కాగా దాన్ని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly రాసిన కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి ప్రజలు తమ మద్దతు లేదా అసమ్మతిని తెలియజేయడానికి భారత ప్రభుత్వం ఎటువంటి ఫోన్ నంబర్‌ను జారీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll