వాహనాలు దూసుకెళ్తున్న ఒక రోడ్డుపై ఆకస్మాతుగా ఒక వ్యక్తి వచ్చి ఒక RTC బస్సు ముందు టైర్ల మధ్యలో పడుకొని, తన పైన బస్సు వెళ్ళిపోగానే లేచి వెళుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని యూసుఫ్‌గూడ ప్రధాన రహదారి వద్ద జరిగింది అని, ఒక రీల్ షూట్ చేస్తూ ఈ వ్యక్తి ఇలా చేశాడు అని చెప్తూ నెటిజన్లు షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజం ఉందో, ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: హైదరాబాద్ యూసుఫ్‌గూడ ప్రధాన రహదారి వద్ద ఒక రీల్ షూట్ చేస్తూ ఒక వ్యక్తి RTC బస్సు ముందు టైర్ల మధ్యలో పడుకొని , తన పైనుండి బస్సు వెళ్ళిపోగానే లేచి వెళ్లిపోయిన నిజమైన సంఘటనకి చెందిన వీడియో.
ఫాక్ట్(నిజం): ఇది VFX ఉపయోగించి చేసిన వీడియో. ఈ వీడియో ఒక నిజమైన సంఘటనకి చెందినది కాదు అని, ఇది పూర్తిగా ‘ఎడిటెడ్ వీడియో’ అని చెప్పి తెలంగాణ స్టేట్ రోడ్ TGSRTC ఎండీ, VC సజ్జనార్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. కావున పోస్ట్ చేస్తున్న క్లెయిమ్ తప్పు
వైరల్ అవుతున్న ఈ వీడియోను క్షుణ్ణంగా చూస్తే, ఇందులో చాలా వింత ఫ్రేమ్స్ మాకు కనిపించాయి. వీటి ఆధారంగా, ఇది ఒక ‘ఎడిట్ వీడియో’ అని మేము నిర్ధారణకు వచ్చాము.
మొదటగా, రోడ్ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి యొక్క నీడ చాలా చోట్ల కనిపించదు. ఈ కింద కొల్లాజ్ మీకు ఆ తేడాలు చూపిస్తుంది.
మరో పెద్ద తప్పు ఏంటి అంటే, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి బస్సు తన మీద నుంచి వెళ్లిపోయాక రోడ్ మీద నుండి పక్కకి వెళ్ళిపోతున్నప్పుడు తన కాళ్ళ కింద అకస్మాత్తుగా కొన్ని రోడ్ మార్కింగ్ లైన్స్ కనిపిస్తాయి, మళ్ళీ కాసేపటికి అవి మాయమైపోతాయి. ఇది ఒక ఎడిటింగ్ తప్పిదం.
ఇంతే కాక, ఈ వీడియో ఫేక్ అని, ఇది పూర్తిగా ‘ఎడిటెడ్ వీడియో’ అని చెప్తూ TGSRTC మేనేజింగ్ డైరెక్టర్, VC సజ్జనార్ ,‘x’ ముఖంగా ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. “… లైక్ లు, కామెంట్ల కోసం చేసే ఈ తరహా అనాలోచిత పనులను ఇతరులు అనుకరించే ప్రమాదం పొంచి ఉంది. సరదా కోసం చేసే ఎడిటెడ్ వీడియోలు ఇతరులకు ప్రాణాప్రాయం కూడా కలిగిస్తాయి. ఇలాంటి ఘటనలను #TGSRTC యాజమాన్యం సీరియస్‌గా తీసుకుంటోంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.,” అని సజ్జనార్ 21 జూన్ 2024 నాడు ట్వీట్ చేశారు.
వైరల్ వీడియో గురించి వివరాలు తెలుసుకునే ప్రక్రియలో భాగంగా అందులో కొన్ని కీ ఫ్రేమ్స్ పైన్ ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, మాకు ఇదే వీడియో @creative_saii అనే ఒక ఇంస్టాగ్రామ్ అకౌంట్లో దొరికింది. ఈ పేజీలో వాళ్ళు వీడియో ఎడిటింగ్ స్కిల్స్ సంబంధించిన ట్యుటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం డిలీట్ అయ్యి ఉన్న ఈ వీడియోని 16 జూన్ 2024 నాడు వాళ్ళు అప్లోడ్ చేశారు. ఈ వీడియోని ఎవరు తయారు చేశారు, ఇంకా ఎలా చేస్తారు అనే వివరాల కోసం వాళ్ళకి మేము మెసేజ్ చేసాము. వాళ్ళు మాకు స్పందించిన వెంటనే ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది
చివరగా, ఒక ఎడిట్ చేసిన వీడియోని, రీల్ షూట్ చేయడానికి ఒక వ్యక్తి రోడ్డు పైన వెళ్తున్న బస్సు టైర్ల మధ్యలో ఉన్న ఖాళీలో పడుకొని విన్యాసం చేసిన నిజమైన సంఘటన దృశ్యాలని తప్పుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.