హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలలో ఈటల రాజేందర్ గెలుపుని కేసీఆర్ ఆపలేడని కాంగ్రెస్ నూతన తెలంగాణ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల ‘ABN’ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపినట్టు సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలలో ఈటల రాజేందర్ గెలుపు కేసీఆర్ ఆపలేడని తెలంగాణ PCC చైర్మన్ రేవంత్ రెడ్డి ‘ABN’ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఫాక్ట్ (నిజం): తెలంగాణ PCC చైర్మన్ రేవంత్ రెడ్డి ‘ABN’ న్యూస్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి హుజురాబాద్ ఎన్నికలలో పోటీచేసి వుంటే అతని గెలుపుని కేసీఆర్ ఆపలేడని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్ధిగా హుజురాబాద్ ఎన్నికలలో గెలుస్తాడని రేవంత్ రెడ్డి అనలేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో చేస్తున్న క్లెయిమ్‌కు సంబంధించిన వివరాల కోసం గుగూల్‌లో వెతికితే, తెలంగాణ PCC చైర్మన్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని ‘ABN’ న్యూస్ ఛానల్ తమ ఫేస్బుక్ పేజిలో షేర్ చేసినట్టు తెలిసింది. ‘ABN’ న్యూస్ ఛానల్ ఈ వీడియోని “రాజేందర్ గెలుపును కేసీఆర్ ఆపలేడు…” అనే టైటిల్ తో ఫేస్బుక్ లో పబ్లిష్ చేసింది.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంలో కేసీఆర్ పాత్ర ఎంతవరకు ఉందని ‘ABN’ న్యూస్ యాంకర్ అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ, కేసీఆర్ ఈటల రాజేందర్‌ని వ్యూహాత్మకంగా బీజేపీలోకి చేర్పించారని ఆరోపించారు. ఈ దృశ్యాలు వీడియోలోని 4:42 నిమిషాల దగ్గర నుండి చూడవచ్చు. ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి హుజురాబాద్ ఎన్నికలలో పోటీ చేస్తే అతని గెలుపును కేసీఆర్ ఆపలేడని రేవంత్ రెడ్డి ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్ధిగా హుజురాబాద్ ఎన్నికలలో గెలుస్తాడని రేవంత్ రెడ్డి ఎక్కడా అనలేదు. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి వీడియోని ‘ABN’ న్యూస్ ఛానల్ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది. రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్‌కి సంబంధించి చేసిన వ్యాఖ్యలని వీడియోలోని 44:45 నిమిషాల దగ్గర నుండి చూడవచ్చు.
చివరగా, ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్ధిగా హుజురాబాద్ ఉపఎన్నికలలో గెలుస్తాడని తెలంగాణ PCC చైర్మన్ రేవంత్ రెడ్డి అనలేదు.