Fake News, Telugu
 

రోడ్డుపై ధాన్యం ఆరబోసిన రైతు, ప్రమాద బాధితుడికి రూ.10-20 లక్షలు చెల్లించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వలేదు

0

“రోడ్డు పైన ధాన్యం ఆరబోసిన రైతుల పైన కేసు నమోదు చేయడంతో పాటు రూ.10,000 జరిమానా విధించబడుతుంది. ఒకవేళ ఈ ఆరోబోసిన ధాన్యం వలన వాహనదారులు ప్రమాదవశాత్తు గాయపడినా/మరణించినా, సంబంధిత రైతు నుంచి రూ.10-20 లక్షలు బాధితులకు ఇవ్వవలసిన ఉంటుంది.” అని సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: రోడ్డు పైన ధాన్యం ఆరబోసిన రైతులపైన కేసు వేయడంతో పాటు రూ.10,000 జరిమానా విధించబడుతుంది. అలాగే, ఒకవేళ ఈ ఆరోబోసిన ధాన్యం వలన వాహనదారులు ప్రమాదవశాత్తు గాయపడినా/మరణించినా, సంబంధిత రైతు నుంచి రూ.10-20 లక్షలు బాధితులకు ఇవ్వవలసి ఉంటుంది అని సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ఫాక్ట్: సుప్రీం కోర్టు ఎక్కడా కూడా ఇటువంటి తీర్పుని ఇవ్వలేదు. కానీ, రోడ్డు పైన ధాన్యం ఆరబోయడం వలన అది ప్రమాదాలకు దారి తీస్తుంది కాబట్టి అది చట్ట రీత్యా నేరం. ఇలా చేసిన వారి పైన ఇదివరకే కేసులు నమోదు చేశారు. ఒకవేళ, ఈ కారణంగా ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే ధాన్యం ఆరబోసిన వ్యక్తిని బాధ్యున్ని చేస్తూ సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శిక్ష విధిస్తారు. అయితే, సంబంధిత రైతు రూ.10-20 లక్షలు బాధితుడికి ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎక్కడా తీర్పు చెప్పలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా, సుప్రీం కోర్టు ఇటువంటి తీర్పు/ఆర్డర్ ఇచ్చిందా లేదా అనే విషయాన్ని గురించి సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైటులో వెతకగా, ఎక్కడా కూడా ఇటువంటి తీర్పు ఇచ్చినట్లు సమాచారం లభించలేదు. అలాగే, సంబంధిత వెబ్‌సైటులు మరియు మీడియాలో కూడా ఈ విషయాన్ని గురుంచి రిపోర్ట్ కాలేదు. అయితే, రోడ్డు పైన ధాన్యం ఆరబోయటం వలన అనేక రోడ్డు ప్రమాదాలు జరిగిన మాట వాస్తవమే. దీనికి సంబంధించిన కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.  

అయితే, రోడ్డు ప్రమాదాల దృష్ట్యా రైతులను ఇలా రోడ్డులపైన ధాన్యాన్ని ఆరపోయవద్దు అని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు  అనేక సందర్భాలలో పోలీసులు హెచ్చరించారు. సంబంధిత వార్తలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇలా నిబంధనలు పాటించకుండా రోడ్డు పైన వాహనాలకు అడ్డుగా ధాన్యాన్ని ఆరబోసిన 8 మంది వ్యక్తులపైన 22 మే 2021లో కీసర పోలీసులు IPC సెక్షన్ 188(Disobedience to order duly promulgated by public servant), 336 (Act endangering life or personal safety of others) కింద కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం ఋజువైతే సెక్షన్ 188 కింద 6 నెలల జైలు శిక్ష లేదా రూ. 1000  జరిమానా లేదా రెండూ విధిస్తారు. సెక్షన్ 336 కింద 3 నెలలు జైలు శిక్ష లేదా రూ. 250 జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఈ కేసుకి సంబంధించిన FIR ను ఇక్కడ చూడవచ్చు.

అలాగే, ఇటీవల హన్మకొండ జిల్లాలో కూడా ధాన్యాన్ని రోడ్డుకు అడ్డుగా పోయడం వలన కారు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా ఒకరు గాయపడ్డారు. అప్పుడు, సంబంధిత వ్యక్తి పైన IPC సెక్షన్ 304(A) (Causing death by negligence), 337 (Causing hurt by act endangering life or personal safety of others) కింద కేసు నమోదు చేశారు. 304 (A) రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా కేసును బట్టి జరిమానా లేదా రెండూ విధిస్తారు. 337 కింద 6 నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ కేసుకి సంబంధించి FIR ను ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, రోడ్డు పైన ధాన్యం ఆరబోయడం చట్టప్రకారం నేరమే అయినా సంబంధిత రైతు రూ.10-20 లక్షలు భాదితుడుకి ఇవ్వాలని సుప్రీం కోర్టు ఎక్కడా తీర్పు చెప్పలేదు.

Share.

About Author

Comments are closed.

scroll