Fake News, Telugu
 

స్వామి ఓంకారానంద పాడిన ఈ గణేష్ స్తుతిని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాడినట్లుగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గణేష్ స్తుతిని పాడటం వినవచ్చని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ పోస్టులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గణేష్ స్తుతిని పాడుతున్న ఆడియో క్లిప్.

ఫ్యాక్ట్ (నిజం): డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం గణేష్ స్తుతిని బహిరంగంగా పాడినట్లు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అలాగే, వైరల్ వీడియోలో ఉన్న స్వరము అబ్దుల్ కలాం స్వరము కంటే భిన్నంగా ఉందని తెలుస్తుంది. యూట్యూబ్ కామెంట్లలో దొరికిన సమాచారంతో మేము తమిళనాడులోని స్వామి ఓంకారానంద ఆశ్రమానికి ఈ- మెయిల్ పంపాము. వారు ఈ వైరల్ వీడియోలో ఉన్న స్వరం స్వామి ఓంకారానంద గారిది అని ధృవీకరించారు. కావున,  వీడియోలో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించేదిగా ఉంది.

మొదట, వైరల్ వీడియోలో ఉన్న వాయిస్ ను మేము అబ్దుల్ కలాం వాయిస్ తో  పోల్చాము. అవి ఒకే విధంగా అనిపించినప్పటికీ, ఒకటి కావు. తరువాత, అబ్దుల్ కలాం గణేష్ స్తుతిని పాడటం గురించి ఏవైనా వార్తలు ఉన్నాయా అని ఆన్ లైన్ లో వెతకగా ఎటువంటి సమాచారం దొరకలేదు. ఇక, ఇదే వీడియోను వివిధ యూట్యూబ్ ఛానెళ్లలో కూడా ఇదే క్లెయిమ్ చేస్తూ అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ యూట్యూబ్ వీడియోల క్రింద కామెంట్లను పరిశీలించగా చాలా మంది ఈ గొంతు తమిళనాడుకు చెందిన శ్రీ ఓంకారానంద స్వామీజీకి చెందినదని పేర్కొన్నారు.

వినాయక చవితి సందర్భంగా తన భక్తులను ఆశీర్వదించడానికి స్వామి ఓంకారానంద నుండి వచ్చిన ఆడియో సందేశం ఇది అని ఒక కామెంట్లో చెప్పారు.

దీని ఆధారంగా స్వామి ఓంకారానంద యొక్క వివిధ సోషల్ మీడియా ఛానెళ్లలో వెతికాము, కాని ఈ వైరల్ అవుతున్న గణేష్  స్తుతికి సంబంధించిన వీడియో ఎక్కడా దొరకలేదు. కానీ వైరల్ వీడియోలలోని స్వరాన్ని స్వామి ఓంకారానంద యొక్క పాత ఆడియో టేపులతో పోల్చిన తరువాత, ఈ గణేష్ స్తుతి ఆయన పాడి ఉండవచ్చు అని స్పష్టమవుతుంది. స్వామి ఓంకారానంద 2021లో కన్నుమూశారు. మేము తన వెబ్సైట్ లో ఇచ్చిన ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని గురించి వారిని సంప్రదించగా, వారు ఈ వీడియోలో ఉన్న స్వరం స్వామి ఓంకారానందది అని స్పష్టం చేశారు.

డాక్టర్ అబ్దుల్ కలాంకు నివాళిగా 2015లో, కాన్పూర్ లో గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా కాన్పూర్ లో ఒక క్షిపణి వంటి నిర్మాణంపైన  గణేష్ విగ్రహాన్ని రూపొందించినట్లు తెలిసింది.

చివరిగా, వైరల్ అవుతున్న వీడియోలో గణేష్ స్తుతిని పాడిన గొంతు డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాంది కాదు; అది స్వామి ఓంకారానందది.

Share.

About Author

Comments are closed.

scroll