Fake News, Telugu
 

అత్యాచారానికి సంబంధించి కాన్పూర్ కోర్టు వెలువరించిన తీర్పుని లవ్ జిహాద్ చట్టం కింద మొదటి శిక్ష అంటూ షేర్ చేస్తున్నారు.

0

‘లవ్ జిహాద్ చట్టం కింద యూపీలో మొట్టమొదటి తీర్పు వెలువడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ‘లవ్ జిహాద్’ చట్టం కింద తొలిసారి కాన్పూర్ యువకుడికి 10 ఏళ్ల జైలు, రూ.30వేల జరిమానా విధిస్తూ కాన్పూర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది’ అంటూ వార్తను ప్రచురించిన ఒక న్యూస్ క్లిప్‌ని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: యూపీలో యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విదిస్తూ లవ్ జిహాద్ చట్టం కింద మొట్టమొదటి తీర్పు వెలువరించిన కాన్పూర్ కోర్టు.

ఫాక్ట్(నిజం): కాన్పూర్ కోర్టు 2017లో 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జావేద్ అలియాస్ మున్నా అనే వ్యక్తిని  దోషిగా నిర్ధారిస్తూ, అతనికి పదేళ్ల జైలు శిక్ష మరియు రూ.30,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ అత్యాచారం కేసుకి సంబంధించిన తీర్పుని చాలా వార్తా సంస్థలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన లవ్ జిహాద్ చట్టం కింద కోర్టు శిక్ష విధించిందంటూ తప్పుగా వార్తను ప్రచురించాయి. పైగా ఉత్తరప్రదేశ్ లవ్ జిహాద్ చట్టాన్ని 2020లో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది, కానీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1) ప్రకారం, కొత్తగా రూపొందించిన చట్టాల కింద గతంలో జరిగిన నేరాలను విచారించడంగాని, శిక్షించడంగాని జరగదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇదే వార్తని దేశంలోని ప్రముఖ ఇంగ్లీష్ వార్తా సంస్థలు ప్రసారం చేయగా, తెలుగులో etv, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, న్యూస్ 18 తెలుగు మొదలైన ప్రముఖ వార్తా సంస్థలతో పాటు ఇతర వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. వార్తా సంస్థలు ఈ వార్తని ప్రచురించడం వల్ల ఇదే నిజం అనుకొని సోషల్ మీడియా వినియోగదారులు ఈ వార్తని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. అసలు ఈ వార్తకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

20 డిసెంబరు 2021న, కాన్పూర్‌లోని స్థానిక న్యాయస్థానం 2017లో ఒక 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడిన కేసుకి సంబంధించి POCSO చట్టంలోని 363, 366A, 376 సెక్షన్లు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989 సెక్షన్ 3(2)(v) కింద కేసులు ఆరోపణలు ఎదురుకొంటున్న జావేద్ అలియాస్ మున్నా అనే వ్యక్తిని  దోషిగా నిర్ధారిస్తూ, అతనికి పదేళ్ల జైలు శిక్ష మరియు రూ.30,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఐతే ఈ అత్యాచారం కేసుకి సంబంధించిన తీర్పుని చాలా వార్తా సంస్థలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రూపొందించిన లవ్ జిహాద్ చట్టం కింద కోర్టు శిక్ష విధించిన్దంటూ తప్పుగా వార్తను ప్రచురించాయి.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లవ్ జిహాద్ చట్టాన్ని 2020లో మొదటిసారి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చింది, 2021లో చట్టం చేసింది. ఐతే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వైరల్ అవుతున్న కేసు 2017లో జరిగిన అత్యాచారానికి సంబంధించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1) ప్రకారం, కొత్తగా రూపొందించిన చట్టాల కింద గతంలో జరిగిన నేరాలను విచారించడంగాని, శిక్షించడంగాని జరగదు. దీన్నిబట్టి, ఈ కేసుకి లవ్ జిహాద్ చట్టం వర్తించదన్న విషయం స్పష్టమవుతుంది.

మరొక ముఖ్య విషయం ఏంటంటే, నిందితుడు జావేద్ అలియాస్ మున్నా  తన స్నేహితురాలి అన్నయ్య అని, అతను తనకు ముందునుండే తెలుసనీ బాధితురాలు కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్‌లో పేర్కొంది. అంటే జావేద్ మతం గురించి బాదితురాలికి ముందే తెలిసి ఉంటుంది, దీన్నిబట్టి పోస్టులో చెప్తున్నట్టు నిందితుడు తన మతం గురించి దాచిపెట్టాడన్న వాదన తప్పని అర్ధమవుతుంది.

చివరగా, అత్యాచారానికి సంబంధించి కాన్పూర్ కోర్టు వెలువరించిన తీర్పుని లవ్ జిహాద్ చట్టం కింద మొదటి శిక్ష అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll