Fake News, Telugu
 

ఈ వీడియోలో ఓటర్లు EVMలను ధ్వంసం చేసింది తమ ఓట్లు ఇతరులు వేసారన్న కారణానికి, ఎవరికి వేసినా బీజేపీకి పడుతుందని కాదు

0

మాణిపూర్‌లో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుకు ఓటు వేసినా, బీజేపీ కమలం గుర్తుకే పడుతుందని ప్రజలు ఆగ్రహించి EVM మెషిన్‌లను నేలకేసి కొట్టారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజాలేమిటో తెలుసుకుందాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మాణిపూర్‌లో ఏ పార్టీ గుర్తుకు ఓటు వేసినా, బీజేపీ కమలం గుర్తుకే పడుతుందని ఆగ్రహించి EVM మెషిన్‌లను ప్రజలు నేలకేసి కొట్టిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని ఘటన మాణిపూర్ ఖురాయ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరిగింది. తమ ఓట్లు అంతకు ముందే ఎవరో వేసినట్టు చూపించడంతో ఆగ్రహించిన ఓటర్‌లు ఇలా EVMలను ధ్వంసం చేశారు. ఒక పార్టీకు ఓటు వేస్తే వేరే పార్టీకు పడ్డ ఘటనలు మణిపూర్‌లో రిపోర్ట్ కాలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రస్తుతం షేర్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం కీవర్డ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం వీడియోలోని దృశ్యాలు మణిపూర్‌లోని ఖురాయ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరిగిన ఘటనకు సంబంధించిందని తెలుసుతుంది.

ఖురాయ్, మొయిరంగకంపు సాజేబ్ ప్రాంతంలోని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటర్‌లు ఆగ్రహంతో EVMలను ధ్వంసం చేశారు. ఈ బూత్‌లో కొందరి ఓట్లు అంతకు ముందే ఎవరో వేసినట్టు తెలియడంతో ఆగ్రహంతో వారు ఇలా చేసినట్టు ఈ కథనాలు రిపోర్ట్ చేశాయి.

ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాలు కూడా ఈ ఘటనకు కొందరి ఓట్లు అంతకు ముందే ఎవరో వేసినట్టు చూపించడమే అని పేర్కొన్నాయి. ఈ ఘటనకు కారణం ‘ఏ గుర్తుకు వేసినా, బీజేపీ కమలం గుర్తుకే ఓటు పడడం ‘ అని రిపోర్ట్ చేసిన కథనాలేవి మాకు కనిపించలేదు.

ఐతే ఈ ఘటనను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల కమిషన్ ఈ బూత్‌లో తిరిగి రీపోలింగ్‌కు ఆదేశించింది.  కాగా మణిపూర్‌లో పలు పార్టీలు అక్రమాలకూ పాల్పడుతున్నాయని ఓటర్లు అసహనం వ్యక్తం చేసినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసినప్పటికీ, మణిపూర్‌లో ఇలా ఒక పార్టీకు ఓటు వేస్తే వేరే పార్టీకు పడ్డ ఘటనలు మాత్రం రిపోర్ట్ కాలేదు. 

ఇదే విషయాన్నీ మణిపూర్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ కూడా ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

చివరగా, ఈ వీడియోలో ఓటర్లు EVMలను ధ్వంసం చేసింది తమ ఓట్లు ఇతరులు వేసారన్న కారణానికి, ఎవరికి వేసినా బీజేపీకి పడుతుందని కాదు.

Share.

About Author

Comments are closed.

scroll