2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బోగస్ ఓట్లు, రిగ్గింగ్ అంశాలపై సోషల్ మీడియాలో చాలా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో దొంగ ఓట్లు వేసేందుకు నకిలీ చేతివేళ్లు సిద్ధం చేశారని అని చెప్తూ ఉన్న పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి మద్దతుగా నకిలీ చేతివేళ్లను చూపిస్తున్న ఫోటో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2024 లోక్‌సభ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు కృత్రిమ చేతివేళ్లు సిద్దం చేశారు, దానికి సంబంధించిన ఫోటోలు.
ఫాక్ట్(నిజం): 2024 భారతదేశ సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫోటోలోని కృత్రిమ చేతి వేళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ ఫోటోలు జపాన్ లో కృత్రిమ చేతివేళ్ల తయారీకి సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ పోస్టులో తెలిపినట్లుగా ఇటీవల ఇలాంటి ఏదైనా సంఘటన జరిగిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, ఎక్కడ ఇలా 2024 లోక్‌సభ ఎన్నికల కోసం నకిలీ కృత్రిమ చేతివేళ్లు తయారు చేసినట్లు ఎటువంటి రిపోర్ట్స్ మాకు దొరకలేదు. అయితే మార్చ్ 2017 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఇలాంటి ఘటన ఒకటి రిపోర్ట్ చేస్తున్న ‘ఇండియా టుడే’ వార్తకథనం ఒకటి మాకు లభించింది.
ఈ క్రమంలోనే ఇదే క్లెయిమ్ తో ఇవే వైరల్ ఫోటోలు గతంలో కూడా 2019 ఎన్నికల సందర్బంగా వైరల్ అయినట్లు మాకు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). భారత మాజీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎస్.వై ఖురేషీ 2017లో తనకు కూడా ఇలాంటి ఫొటోలు పంపారు అని ట్వీట్ చేశారు.
ఈ వైరల్ ఫోటోలకు సంబంధించిన మరింత సమచారం కోసం, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే Deceptology అనే వెబ్సైట్ ‘How fake pinkies help Japanese gangsters’ అనే శీర్షికతో వైరల్ ఫోటోలు నుంచి ఒక ఫోటోను రిపోర్ట్ చేస్తూ 2014లో ప్రచురించిన కథనం లభించింది. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు సిలికాన్ శరీర భాగాలను లేదా తీవ్రమైన ప్రమాదాల్లో గాయపడిన వారికి కాళ్లు, చేతులను తయారు చేసే వైద్యుడి డాక్టర్ షింటారో హయాషి వివరాలను ఈ కథనం తెలుపుతుంది.

ఈ క్రమంలోనే 2019లో ఈ ఫోటోలు ఇదే క్లెయింతో వైరల్ అయినప్పుడు దాన్ని డిబంక్ చేస్తూ AFP ఫాక్ట్ చెక్ పబ్లిష్ చేసిన కథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం వైరల్ ఫోటోలోని పై ఫోటోని జపనీస్-అమెరికన్ జర్నలిస్ట్ అకికో ఫుజిటా యొక్క వ్యక్తిగత వెబ్‌సైట్ నుండి తీసుకోబడిందని. 16 డిసెంబర్ 2013న అకికో ఫుజిటా వెబ్‌సైట్ నందు ప్రచురించబడిన ఈ కథనం యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. ఈ కథనం 2013లో ఏబీసీ న్యూస్ మీడియా ‘Prosthetic Fingers Help Reform Japan’s Feared Yakuza Gangsters’ అనే శీర్షికతో ప్రచురించిన కథనం ఆధారంగా పబ్లిష్ చేసినట్లు తెలిసింది.

జూన్ 2013లో ‘ABC‘ న్యూస్ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన కథనం ప్రకారం జపాన్‌లో, యాకుజా సభ్యులు అంటే జపనీస్ మాఫియాలో సభ్యులు అని తెలుస్తుంది.ఈ నకిలీ వేళ్ళను జపాన్ కు చెందిన మాఫియా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంది. యాకూజా ముఠా సభ్యులు తాము చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా కొన్ని సార్లు తమ వేళ్లను తానే నరికి వేసుకుంటారు. వీళ్ళు మాఫియా నుంచి బయటకు వచ్చాక ఈ తెగిన చేతివేళ్లను బట్టి వీరు గతంలో మాఫియాలో ఉన్నారని గుర్తించి వీరికి ఎవరూ పని ఇవ్వరు. అలాంటి వారి ఎక్కువగా ఈ కృత్రిమ వేలును ఉపయోగిస్తారు ఇలాంటి వారి కోసం డాక్టర్ షింటారో హయాషి, సిలికాన్ ప్రొస్తెటిక్ చేతివేళ్లు తయారు చేస్తారు. ఈయన తాయారు చేసే కృత్రిమ వేళ్లు ఒక్కొక్కటి దాదాపు $3,000 ధర ఉంటుంది, క్లయింట్ యొక్క ఖచ్చితమైన చర్మం రంగుతో సరిపోలడానికి వేళ్లు జాగ్రత్తగా పెయింట్ చేయబడతాయి. హయాషి వ్యాపారంలో 5 శాతాన్ని మాజీ యాకుజా సభ్యులు కలిగి ఉన్నారు. ఈ సమాచారం బట్టి, జపనీస్ మాజీ-మాఫియా సభ్యుల కోసం సిద్ధం చేసిన కృత్రిమ వేళ్లను ఈ వైరల్ ఫోటో చూపిస్తున్నట్లు మనం నిర్థారించవచ్చు.

చివరగా, ఈ కృత్రిమ వేళ్ల ఫోటోలకు 2024 భారతదేశ సార్వత్రిక ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు, ఈ వైరల్ ఫోటోలు జపాన్‌కు చెందినవి.