Fake News, Telugu
 

చంద్రబాబు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వై.ఎస్. జగన్ లేచి వెళ్లిపోయినట్లు ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

“ఇటీవల ఓ విలేకరుల సమావేశంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఓ ప్రశ్న అడగగానే బాధ పడుతూ లేచి వెళ్ళిపోయాడు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల ఓ విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌ లేచి వెళ్లిపోయారు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది. ఇటీవల 20 నవంబర్ 2024న తాడేపల్లిలో జరిగిన వైయస్‌ఆర్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు వై.యస్. జగన్ విలేకరుల సమావేశానికి సంబంధించిన వీడియోలో కొంత భాగాన్ని ఎడిట్ చేసి ఈ వైరల్ వీడియోను రూపొందించారు. వాస్తవంగా, ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గురించి అడిగిన ప్రశ్నకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు  వై.ఎస్. జగన్ సమాధానం చెప్పారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వైరల్ వీడియో క్లిప్ యొక్క పూర్తి నిడివి గల వీడియో లభించింది. ఈ వీడియోను ‘ YSR Congress Party (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ)’ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో, 20 నవంబర్ 2024న లైవ్ టెలికాస్ట్ చేయబడింది. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు తాడేపల్లిలో జరిగిన వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వై.యస్. జగన్ విలేకరుల సమావేశాన్ని చూపిస్తున్నాయి.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు  టైంస్టాంప్ 02:06:57 వద్ద మొదలై, టైంస్టాంప్ 02:07:25 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. వాస్తవంగా, ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గురించి అడిగిన ప్రశ్నకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు  వై.ఎస్. జగన్ సమాధానం చెప్పారు. ఈ వీడియోలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి  జగన్‌ను ప్రశ్న అడగా “సీ ఎవ్వరు సీఎంగా ఉంటారు అనేది వారు చేసే మంచి పనుల మీద ఆధారపడి ఉంటుంది, ప్రజలు వాళ్ళను ఆశీర్వదించే దాని బట్టి ఉంటుంది, ఇంతకన్నా ఏం ఉంటుంది” అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. దీన్ని బట్టి ఈ విలేకరుల సమావేశానికి సంబంధించిన వీడియోలో కొంత భాగాన్ని క్లిప్ చేసి, ఏపీ సీఎం చంద్రబాబు గురించి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వై.ఎస్. జగన్ లేచి వెళ్లిపోయినట్లు అర్థం వచ్చేలా ఈ వైరల్ వీడియోను రూపొందించారు అని నిర్ధారించవచ్చు.

చివరగా, చంద్రబాబు పాలనపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వై.ఎస్.జగన్‌ లేచి వెళ్లిపోయాడు అంటూ ఒక ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll