“ట్విట్టర్‌లో ఆడవాళ్ల ఫోటోలను మార్పింగ్స్ చేస్తూ, ఆడవాళ్లను బూతులు తిడుతు వేధించే YSRCP సోషల్ మీడియా కార్యకర్తలకు దేహశుద్ది చేస్తున్న పోలీసులు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇదే వీడియోను “సంధ్య థియేటరులో పర్సులు కొట్టేస్తూ దొరికిన పవన్ కళ్యాణ్ అభిమానులను చిక్కడపల్లి పోలీసులు కొడుతున్న దృశ్యాలు” అంటూ షేర్ చేస్తూ చేస్తున్నారు (ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఓ పోలీసు అధికారి కొంతమంది యువకులను కొట్టడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ట్విట్టర్‌లో ఆడవాళ్ల ఫోటోలను మార్పింగ్స్ చేస్తూ, ఆడవాళ్లను బూతులు తిడుతు వేధించే YSRCP సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు కొడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో. ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినది.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోకి, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ నగర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొంతమంది యువకులను కొట్టిన దృశ్యాలను చూపిస్తున్నది. రిపోర్ట్స్ ప్రకారం,జూన్ 2022లో బీజేపీ బహిష్కృత నేతలు నూపూర్ శర్మ మరియు నవీన్ కుమార్ జిందాల్ ముహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యల చేయగా, ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ముస్లింలు నిరసనల చేపట్టారు. ఈ నిరసనల సందర్భంగా అరెస్ట్ చేసిన కొంతమంది యువకులను సహరాన్‌పూర్ నగర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొట్టారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని కీఫ్రేములతో కూడిన పలు వార్త కథనాలు లభించాయి(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). జూన్ 2022లో పబ్లిష్ అయిన ఈ వార్త కథనాల ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు జూన్ 2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొంతమంది యువకులను కొట్టిన ఘటనకు సంబంధించినవి.
ఈ కథనాల ప్రకారం, జూన్ 2022లో బీజేపీ బహిష్కృత నేతలు నూపూర్ శర్మ మరియు నవీన్ కుమార్ జిందాల్ ముహమ్మద్ ప్రవక్త పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ముస్లింలు నిరసనల చేపట్టారు, ఈ నిరసనల సందర్భంగా అరెస్ట్ చేసిన కొంతమంది యువకులను సహరాన్‌పూర్ నగర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ BJP ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి X లో పోస్ట్ చేయగా, ఈ వీడియో వైరల్ అయింది. ఇదే వీడియోను ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఉత్తరప్రదేశ్ కు చెందినదిగా పేర్కొంటూ జూన్ 2022లో తన X(ట్విట్టర్)లో పోస్ట్ చేసారు. దీన్ని బట్టి వైరల్ వీడియోలోని దృశ్యాలు 2022లో ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ నగర పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కొంతమంది యువకులను కొట్టిన సంఘటనకు సంబంధించినవిగా మనం నిర్ధారించవచ్చు.
ఇటీవల పలువురు YSRCP సోషల్ మీడియా కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పలు రిపోర్ట్స్ ఉన్నాయి.
చివరగా, YSRCP సోషల్ మీడియా కార్యకర్తలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొడుతున్న దృశ్యాలు అని, అలాగే దొంగతనం చేస్తూ పట్టుబడ్డిన పవన్ కళ్యాణ్ అభిమానులను పోలీసులు కొడుతున్న దృశ్యాలు అంటూ సంబంధంలేని ఉత్తరప్రదేశ్ కు చెందిన పాత వీడియోను రెండు తెలుగు రాష్ట్రాలకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.