Fake News, Telugu
 

ఎగురుతున్న విమానం ఇంజన్‌పై ఒక వ్యక్తి పడుకున్న ఈ వీడియోతో అఫ్గానిస్తాన్‌కి సంబంధంలేదు, ఇది డిజిటల్‌గా తయారు చేసారు

0

తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ని ఆక్రమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండడంతో అక్కడి ప్రజలు చాలా మంది దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న అమెరికన్ ఎయిర్ ఫోర్సు విమానాన్ని పట్టుకు వేలాడుతూ దేశం దాటడానికి ప్రజలు ప్రయత్నించారు, ఈ క్రమంలో కొందరు జారిపడి మరణించారు కూడా. ఐతే ఈ నేపథ్యంలోనే విమానం ఇంజన్‌పై ఒక వ్యక్తి పడుకొని ఉన్న వీడియోని అఫ్గానిస్తాన్‌లోని సంఘటనలకు ముడిపెడుతూ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: విమానం ఇంజన్‌పై పడుకొని అఫ్గానిస్తాన్‌కి చెందిన వ్యక్తి దేశం నుండి తప్పించుకుంటున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో చూపిస్తుంది నిజం కాదు. ఈ వీడియోని వియత్నాంకి చెందిన హుయ్ జువాన్ మాయి (Huy Xuân Mai) అనే ఒక గ్రాఫిక్ డిజైనర్ 2020లోనే తయారు చేసాడు. ఇలాగే ఒక వ్యక్తి విమానంపై వంట చేస్తున్నట్టు, కంప్యూటర్‌పై పనిచేసుకుంటున్నట్టు, పడుకుంటున్నట్టు మొదలైన వీడియోలను కూడా హుయ్ జువాన్ మాయి  డిజిటల్‌గా తయారు చేసాడు. అఫ్గానిస్తాన్‌లో ప్రజలు విమానంపై వేలాడుతూ దేశం దాటడానికి ప్రయత్నించిన మాట నిజమైనప్పటికి ఈ వీడియోకి అఫ్గానిస్తాన్‌ని ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోలో చూపిస్తున్నది నిజం కాదు, ఈ వీడియో డిజిటల్‌గా తయారు చేసింది. పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని ప్రచురించిన ఒక ఆన్లైన్ కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం వియత్నాంకి చెందిన హుయ్ జువాన్ మాయి (Huy Xuân Mai) అనే ఒక గ్రాఫిక్ డిజైనర్ ఈ వీడియోని డిజిటల్ గా తయారు చేసాడు. హుయ్ జువాన్ మాయి డిజిటల్‌గా తయారు చేసిన మరికొన్ని విజువల్స్ కూడా ఈ కథనంలో చూడొచ్చు.

పైన తెలిపిన కథనం ఆధారంగా గూగుల్‌లో వెతకగా హుయ్ జువాన్ మాయి యొక్క ఫేస్ బుక్ పేజీలో ఇదే వీడియోని ఆగస్ట్ 2020లో షేర్ చేసినట్టు తెలుస్తుంది. తన యూట్యూబ్ ఛానల్‌లో ఇలాగే ఒక వ్యక్తి విమానంపై వంట చేస్తున్నట్టు, కంప్యూటర్‌పై పనిచేసుకుంటున్నట్టు, పడుకుంటున్నట్టు మొదలైన వీడియోలు కూడా చూడొచ్చు.

ఇలాంటి  వీడియోలు, ఇతర హాస్యభరిత ఫోటో షాప్‌లు తయారు చేసిన హుయ్ జువాన్ మాయి గురించి పలు వార్తా కథనాలు కూడా రాసాయి, వీటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే పైన తెలిపిన వివరాలను బట్టి వైరల్ అవుతున్న వీడియో నిజం కాదని, ఇది డిజిటల్‌గా తాయారు చేసిందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అఫ్గానిస్తాన్‌లో ప్రజలు విమానంపై వేలాడుతూ దేశం దాటడానికి ప్రయత్నించిన మాట నిజమైనప్పటికి ఈ వీడియోకి అఫ్గానిస్తాన్‌కి ఎటువంటి సంబంధంలేదు.

చివరగా, విమానం ఇంజన్‌పై ఒక వ్యక్తి పడుకున్న ఈ వీడియోకి అఫ్గానిస్తాన్‌కి ఎటువంటి సంబంధంలేదు, ఈ వీడియోని డిజిటల్‌గా తయారు చేసారు.

Share.

About Author

Comments are closed.

scroll