Fake News, Telugu
 

అష్రాఫ్ ఘనీ పాత విదేశీ పర్యటన వీడియోని తాలిబాన్ ఆక్రమణ తరువాత దేశం విడిచి పారిపోతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

తాలిబాన్ ఆక్రమణ తరువాత ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన దేశాన్ని విడిచి పారిపోతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తాలిబాన్ ఆక్రమణ తరువాత అష్రాఫ్ ఘనీ ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని విడిచి పారిపోతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2021 జూలై నెలలో అప్పటి ఆఫ్ఘానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఉజ్బెకిస్తాన్ పర్యటన కోసం కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు, ఇటీవల తాలిబాన్ ఆక్రమణ తరువాత అష్రాఫ్ ఘనీ అఫ్గానిస్తాన్ విడిచి వెళ్ళిన ఘటనకు సంబంధించినవి కావు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని షేర్ చేస్తూ ‘TOLOnews’ న్యూస్ సంస్థ 15 జూలై 2021 నాడు ట్వీట్ పెట్టినట్టు తెలిసింది. అఫ్గానిస్తాన్ అప్పటి అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తన రెండు రోజుల ఉజ్బెకిస్తాన్ పర్యటన కోసం కాబూల్ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్న దృశ్యాలని ఈ ట్వీట్లో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతకగా, అప్పటి అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఉజ్బెకిస్తాన్ పర్యటన కోసం కాబుల్ నుండి బయలుదేరినట్టు అఫ్గానిస్తాన్ ప్రెసిడెన్షల్ పాలెస్ 15 జూలై 2021 నాడు జారీ చేసిన ప్రకటన దొరికింది. తాలిబాన్ల ఆక్రమణ తరువాత అష్రాఫ్ ఘనీ ఆఫ్ఘానిస్తాన్ నుండి పారిపోతున్న దృశ్యాలని ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ‘Reuters’ న్యూస్ సంస్థ ఈ వీడియోకి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అఫ్గానిస్తాన్ దేశం నుండి తమ సైనిక బలగాల ఉపసంహరణకు 11 సెప్టెంబర్ 2021 చివరి తేది అని ప్రకటించిన వెంటనే, తాలిబాన్ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్ దేశంలో మళ్ళీ రక్తపాతం సృష్టిస్తూ పలు ప్రాంతాలని ఆక్రమించడం మొదలుపెట్టారు. 15 ఆగష్టు 2021 నాడు తాలిబాన్ మూకలు అఫ్గానిస్తాన్ దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడంతో, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్ళిపోయారు. అష్రాఫ్ ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బులు నింపుకొని దేశం విడిచి పారిపోయినట్టు రష్యా దౌత్య కార్యాలయం వెల్లడించినట్టు ఈనాడు’ న్యూస్ సంస్థ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. తాలిబాన్లకు భయపడి అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్ళిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో గాని, ఇంటర్నెట్లో గాని ఇప్పటివరకు అందుబాటులో లేవు.

చివరగా,  అష్రాఫ్ ఘనీ తాలిబాన్లకు భయపడి దేశం విడిచి వెళుతున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్న వీడియో పాతది.

Share.

About Author

Comments are closed.

scroll