మహమ్మద్ ప్రవక్తని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కించపరిచినందుకు సుడాన్ లోని ఫ్రాన్స్ ఎంబసీని తగలబెట్టిన సుడాన్ ప్రజలు అని చెప్తూ, దీనికి సంబంధించిన ఒక వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మహమ్మద్ ప్రవక్తని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ కించపరిచినందుకు సుడాన్ లోని ఫ్రాన్స్ ఎంబసీని సుడాన్ ప్రజలు తగలబెట్టిన వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2012లో సుడాన్ లో ఒక సినిమాలో మొహమ్మద్ ప్రవక్తని కించపరిచడాన్ని వ్యతిరేకిస్తూ సుడాన్ లో ఆందోళనకారులు బ్రిటన్, అమెరికా మరియు జర్మనీ రాయబార కార్యాలయాలను ముట్టడించిన సందర్భంలో జర్మనీ ఎంబసీకి ఆందోళనకారులు నిప్పంటించినప్పటిది. ఈ వీడియోకి ఇప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇస్లాంపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోలోని విజువల్స్ పోలిన వీడియో మరియు కొన్ని ఫోటోలను ప్రచురించిన ఒక 2012 వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటోలు మరియు వీడియో 2012లో సుడాన్ లో ఒక సినిమాలో మొహమ్మద్ ప్రవక్తని కించపరిచడాన్ని వ్యతిరేకిస్తూ సుడాన్ లో ఆందోళనకారులు బ్రిటన్, అమెరికా మరియు జర్మనీ రాయబార కార్యాలయాలను ముట్టడించిన సందర్భంలో జర్మనీ ఎంబసీకి ఆందోళనకారులు నిప్పంటించినప్పుడు తీసినవి.
ఈ వార్తా ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా, పోస్టులో ఉన్న వీడియోని పోలిన మరొక న్యూస్ వీడియో మాకు కనిపించింది. ఈ కథనం కూడా ఈ ఘటన 2012లో సుడాన్ లో జరిగినట్టు చెప్తున్నది. ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. పైగా ఇటీవల కాలంలో సుడాన్ లో ఫ్రెంచ్ ఎంబసీకి నిప్పంటించినట్టు ఇటువంటి వార్తా కథనాలు మాకు దొరకలేదు. వీటన్నిటి ఆధారంగా ఈ వీడియో 2012లో సుడాన్ లో జర్మనీ ఎంబసీకి నిప్పంటించినప్పటిదని, ఇప్పటిది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.
ఇటీవల ప్రాఫెట్ మొహమ్మద్ కార్టూన్లు క్లాస్ లో ప్రదర్శించిన కారణంగా శామ్యూల్ పాటీ అనే టీచర్ తలని ఒక 18 ఏళ్ల ముస్లిం యువకుడు నరికివేసిన ఘటన పారిస్ లో జరిగింది. అంతే కాక, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ఇస్లాంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఫ్రాన్స్ తో సహా పలు దేశాలలో ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల మధ్య ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
చివరగా, ఈ వీడియో ఇప్పటిది కాదు, 2012లో సుడాన్ లో జర్మనీ ఎంబసీకి నిప్పంటించినప్పటిది.