విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు మరియు వరదల నేపథ్యంలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒక వ్యక్తి నీటిలో ఇద్దరు పిల్లలను పట్టుకుని ఉన్న వీడియో ఒకటి షేర్ చేస్తూ, ‘విజయవాడ లో వరద నీరు ఒక ప్రక్కన ముంచుకొస్తున్న కూడా ఒక తండ్రి మునిగి పోతున్న తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు’ అని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: విజయవాడలో వరద నీరు ముంచుకొస్తున్నా ఒక తండ్రి మునిగి పోతున్న తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోను బంగ్లాదేశ్ వరదలకు సంబంధించిన వీడియోగా పలు యూజర్లు 25 ఆగస్ట్ 2024 నుండి పోస్టు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలు కానీ మీడియా రిపోర్ట్స్ కానీ మాకు లభించలేదు. కానీ, ఈ వీడియో విజయవాడలో వరదలు రాక ముందు నుండే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోకు విజయవాడలో వరదలకు ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పవచ్చు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఈ వీడియో 25 ఆగస్ట్ 2024 నుండి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) షేర్ చెయ్యబడుతుంది అని తెలిసింది. దీని గురించి మరింత వెతకగా, ఈ వీడియో 2024 బంగ్లాదేశ్ వరదలకు సంబంధించిన వీడియోగా పలు యూజర్లు 25 ఆగస్ట్ 2024 నుండి పోస్టు చెయ్యటం గమనించాం.
ఈ వైరల్ వీడియోతో సహా మరికొన్ని వీడియో క్లిప్స్ పోస్ట్ చేసిన యూట్యూబర్, ‘ఈ వీడియో 2024 వరదలకు సంబంధించినది కాదు, ఇది వాస్తవానికి బంగ్లాదేశ్ లోని మున్షిగంజ్, ధళేశ్వరిలో 2017 వరదలను చూపిస్తుంది. ఈ వీడియోలో పిల్లలు తమ సోదరుడితో ఆడుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
వీటిని ఆధారంగా తీసుకొని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే వీటికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలు కానీ మీడియా రిపోర్ట్స్ కానీ మాకు లభించలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో 30 ఆగస్ట్ 2024 (ఇక్కడ మరియు ఇక్కడ) నుండి భారీ వర్షాలు ఆపై విజయవాడలో వరదలు మొదలయ్యాయి. ఈ వీడియో విజయవాడలో వరదలు రాక ముందు నుండే సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోకు విజయవాడలో వరదలకు ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పవచ్చు (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ).
చివరిగా, ఒక వ్యక్తి నీటిలో ఇద్దరు పిల్లలను పట్టుకుని ఉన్న ఈ వీడియో 2024 విజయవాడ వరదలకు సంబంధించింది అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు.