Fake News, Telugu
 

అత్యాచారానికి పాల్పడిన ముస్లింలను సమర్థిస్తూ అఖిలేష్ యాదవ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు; ఈ వైరల్ పోస్టు ఫేక్

0

“చాలా మంది ముస్లింలు తక్కువ విద్యావంతులు, ముస్లింలు వారి అజ్ఞానం వల్ల అత్యాచారం వంటి తప్పులకు పాల్పడుతున్నారు. కావున అది నేరం కాదు అని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్  వ్యాఖ్యానించారు” అంటూ ఓ పోస్టు  సోషల్  మీడియాలో  వైరల్  అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చాలా మంది ముస్లింలు తక్కువ విద్యావంతులు మరియు వారి అజ్ఞానం కారణంగా అత్యాచారం వంటి నేరాలకు పాల్పడుతున్నారు, కావున అది నేరం కాదు అని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ పోస్టు ఫేక్. గతంలో కానీ, ఇటీవల కానీ ముస్లిం రేపిస్టులను సమర్థిస్తూ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అత్యాచారానికి పాల్పడే ముస్లింలను సమర్థిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, అఖిలేష్ యాదవ్ గతంలో కానీ, ఇటీవల కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ అఖిలేష్ యాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి. అలాగే మేము అఖిలేష్ యాదవ్ మరియు సమాజ్‌వాది పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ)  కూడా పరిశీలించాము, అక్కడ కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు.

ఈ క్రమంలోనే వివిధ రేప్ కేసులపై అఖిలేష్ యాదవ్ స్పందనలను మేము కనుగొన్నాము. ఇటీవల ఆగస్ట్ 2024లో అయోధ్యలో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో నిందితులకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేయడం వివాదాస్పదమైంది అని, ఆయన ప్రకటనపై ఉత్తరప్రదేశ్‌లోని వివిధ రాజకీయ పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పలు రిపోర్టులు పేర్కొన్నాయి (ఇక్కడ, & ఇక్కడ). పలు రిపోర్ట్స్ ప్రకారం, ఈ కేసులో ప్రధాన నిందితుడైన మొయిద్ ఖాన్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన వాడని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ నేతలు ఆరోపించినట్లు తెలుస్తుంది (ఇక్కడ).

అయితే, పలు రిపోర్ట్స్ ప్రకారం అఖిలేష్ యాదవ్ తండ్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అత్యాచారం కేసుల్లో నిందుతులకు మరణశిక్షను వ్యతిరేకిస్తూ, ఇలాంటి తప్పులు అబ్బాయిలు చేస్తారని వ్యాఖ్యానించారు అని తెలుస్తుంది (ఇక్కడ, ఇక్కడ). అలాగే 2015లో ఒక ప్రసంగం సందర్భంగా, ములాయం సింగ్ యాదవ్ ఒక మహిళపై నలుగురు వ్యక్తులు ఎలా అత్యాచారం చేస్తారని, ఇది అసంభవం అని(ప్రాక్టికల్ కాదని) అన్నారు అని తెలుస్తుంది (ఇక్కడ).

 చివరగా, అత్యాచారానికి పాల్పడే ముస్లింలను సమర్థిస్తూ అఖిలేష్ యాదవ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు; ఈ వైరల్ పోస్టు ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll