Fake News, Telugu
 

కర్ణాటకలో ముస్లింలు హిందూ మత జెండాలను లాక్కున్నారు అనే తప్పుడు కథనంతో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఒక ఊరేగింపులో ఓ యువకుడి నుంచి ఓ వ్యక్తి హిందూ మత జెండాను లాక్కుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా హల్ చల్ చేస్తోంది. కర్ణాటకలోని ఒక గ్రామంలో ఊరేగింపు సందర్భంగా హిందూ యువకుడి నుంచి ముస్లిం సమాజానికి చెందిన ఒక వ్యక్తి జెండాను లాక్కొని నేలపై విసిరినట్లు పోస్ట్ వివరణలో పేర్కొనబడింది. పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ లో ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలోని ఒక గ్రామంలో ఊరేగింపు సందర్భంగా హిందూ యువకుడి నుండి ఒక ముస్లిం వ్యక్తి హిందూ మత జెండా లాక్కున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): హర్యానాలోని సనోలి ఖుర్ద్ గ్రామంలో సెప్టెంబర్ 2023లో జన్మాష్టమి ఊరేగింపు సందర్భంగా ఈ సంఘటన జరిగింది. భజరంగ్ దళ్ సభ్యులు కొందరు మత జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ గ్రామంలోని ముస్లిం ప్రాంతంలోకి ప్రవేశించారు. గ్రామంలో మత ఘర్షణలు తలెత్తకుండా గ్రామ సర్పంచ్ సంజయ్ త్యాగి మరియు గ్రామ ఆలయ కమిటీ సభ్యులు జోక్యం చేసుకున్నారు. వారు జెండాలను తీసివేసి, మతపరమైన నినాదాలు చేయవద్దని బృందాన్ని అభ్యర్థించారు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ సంఘటనపై మరింత సమాచారాన్ని పొందడానికి సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్ సెర్చ్ చేసాము. వీడియోకి చెందిన సంఘటన గురించి 2023 సెప్టెంబర్ 10 మరియు 12 తేదీల్లో` అమర్ ఉజాలా ప్రచురించిన ఒక వార్తా కథనం దొరికింది. ఈ నివేదికల ప్రకారం, హర్యానాలోని పానిపట్‌లోని సనోలి ఖుర్ద్ గ్రామంలోని యువకులు జన్మాష్టమి సందర్భంగా ఒక  ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపు ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం గుండా వెళుతుండగా, కొంతమంది బజరంగ్ దళ్ సభ్యులు మతపరమైన జెండాలతో వచ్చి మతపరమైన నినాదాలు చేయడం ప్రారంభించారు.

ఘర్షణను నివారించడానికి, గ్రామ సర్పంచ్ సంజయ్ త్యాగితో పాటు ఆలయ కమిటీ సభ్యులు జోక్యం చేసుకుని ఇద్దరు బజరంగ్ దళ్ యువకుల నుంచి జెండాలను తీసుకున్నారు. బజరంగ్ దళ్ సభ్యులు స్పందించి సర్పంచ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సనోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైరల్ వీడియోలో కనబడుతున్న సంఘటన గురించి సనోలి పోలీస్ స్టేషన్ SHO సునీల్ కుమార్‌ను సంప్రదించగా, యువకుడి నుండి జెండాను తీసుకెళ్లిన వ్యక్తి గ్రామ సర్పంచ్ సంజయ్ త్యాగి అని పేర్కొంటూ ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని ఆయన వెల్లడించారు.

విశ్వాస్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సంజయ్ త్యాగి మాట్లాడుతూ, గ్రామస్థులు జన్మాష్టమి నాడు ఊరేగింపు నిర్వహించారని, ఊరేగింపు మదర్సా సమీపంలోకి రావడంతో, కొంతమంది బజరంగ్ దళ్ సభ్యులు అందులో చేరి, జెండాలు ఊపుతూ నినాదాలు చేయడం ప్రారంభించారని చెప్పారు. ఇది గమనించిన ఆలయ కమిటీ సభ్యుడు ఒక యువకుడిని ఆపాడు, అతనితో కలిసి సర్పంచ్ త్యాగి ఆ యువకుడి చేతిలోని జెండాను తొలగించారు. నినాదాలు చేయడం మానుకోవాలని, ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని తాను బృందాన్ని అభ్యర్థించినట్లు త్యాగి పేర్కొన్నారు. జెండాను తీసుకున్న వ్యక్తి కూడా స్థానిక గ్రామ యువకుడే అని, మత కోణం ఏమి ఇందులో లేదని వివరించారు. గ్రామంలో మత ఘర్షణలు తలెత్తకుండా జోక్యం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అంతటా జెండాను ఏ విధంగానూ అగౌరవపరచడం లేదా తప్పుగా హ్యాండిల్ చేయడం జరగలేదు అని ఆయన పేర్కొన్నారు.

చివరిగా, వైరల్ వీడియో కర్ణాటకలోని ఒక  ఊరేగింపు సందర్భంలో ముస్లింలు హిందూ మత జెండాను లాక్కునట్లు చూపించట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll