చైనాలోని ఒక రెస్టారెంట్ లో ఓ పాకిస్తానీ వ్యక్తి నమాజ్ చేస్తుండంగా, అక్కడ నమాజ్ చెయ్యొద్దని రెస్టారెంట్ యజమాని అతడిని తీవ్రంగా కొట్టాడు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ). ఈ ఆర్టికల్ ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: చైనాలోని ఒక రెస్టారెంట్లో పాకిస్థానీ వ్యక్తి నమాజ్ చేస్తున్నప్పుడు అతడిపై దాడి జరిగింది.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోకు చైనాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వైరల్ వీడియో 2020లో థాయ్‌లాండ్‌లోని సముత్ సఖోన్ ప్రావిన్స్‌లో జరిగిన సంఘటనను చూపుతుంది. వివిధ వార్తా కథనాల ప్రకారం, నిర్ణీత గడువులోగా ఖాతాదారుడి నుంచి డబ్బులు వసూలు చేయడంలో విఫలమైనందుకు రికవరీ ఏజెంట్ పై అదే కంపెనీనికి చెందిన ఉన్నతాధికారులు తీవ్రంగా దాడి చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ అవుతున్న వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, 03 డిసెంబర్ 2020 న “స్టోరీ దిస్ మార్నింగ్” అనే న్యూస్ చానల్ పబ్లిష్ చేసిన న్యూస్ రిపోర్ట్ వీడియో ఒకటి లభించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, వైరల్ వీడియో థాయ్‌లాండ్‌లోని సముట్ సఖాన్ సిటీలో ఒక రుణాలను వసూలు చేసే కంపెనీనికి చెందిన ఉన్నతాధికారులు, నిర్ణీత గడువులోగా ఖాతాదారుడి నుంచి డబ్బులు వసూలు చేయడంలో విఫలమైనందుకు రికవరీ ఏజెంట్ పై దాడి చేసి తీవ్రంగా కొడుతున్న దృశ్యాలు చూపిస్తుంది.
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, బాధితుడు కస్టమర్ల నుండి నిర్ణీత సమయానికి డబ్బు వసూలు చేయకపోవడం, కస్టమర్ ఖాతాలను మానిపులేట్ చేయడం, కస్టమర్ల ఖాతా నుండి డబ్బులు తీసుకుని పేమెంట్ చేయలేకపోయిన ఇతర కస్టమర్ ఖాతాలో జమ చేయడం వంటి ఆరోపణలు ఎదురుకొంటున్నాడు. ఈ ఘటన 2020 జనవరిలో థాయ్‌లాండ్‌లోని సామట్ సఖాన్ ప్రావిన్స్ లోని T.M.N. గ్రూప్ కో. లిమిటెడ్ శాఖలో జరిగింది. దీన్ని బట్టి ఈ వీడియోకు చైనాకు ఎలాంటి సంబంధం లేదని మనం నిర్థారించవచ్చు. అలాగే, నమాజ్ చేసినందుకు ఈ దాడి జరగలేదు అని స్పష్టం అవుతుంది.
చివరగా, థాయ్‌లాండ్‌కు చెందిన పాత వీడియోను చైనాలో పాకిస్థానీ వ్యక్తిపై నమాజ్ చేస్తుండంగా దాడి అని తప్పుగా షేర్ చేస్తున్నారు.