Fake News, Telugu
 

రాహుల్ గాంధీ వయనాడ్‌ రోడ్‌షొలో IUML పార్టీ జెండాలను ఊపిన పాత దృశ్యాలను పాకిస్థాన్ జెండాలు అంటూ షేర్ చేస్తున్నారు

0

కేరళ రాష్ట్రం వయనాడ్‌లో జరిగిన రాహుల్ గాంధీ ర్యాలీలో పాకిస్థాన్ జెండాలు ఊపుతున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. “ఇది పాకిస్థాన్ కాదు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ కేరళ”, అంటూ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేరళ వయనాడ్‌లో రాహుల్ గాంధీ నిర్వహించిన ర్యాలీలో పాకిస్థాన్ జెండాలు ఊపుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో పచ్చ రంగులో కనిపిస్తున్నది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండాలు, పాకిస్థాన్ జాతీయ జెండాలు కావు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వయనాడ్‌ నియాజకవర్గం కోసం ఎన్నికల నామినేషన్ ధాఖలు చేసిన తరువాత రాహుల్ గాంధీ వయనాడ్‌లో ఒక రోడ్‌షొ నిర్వహించారు. ఈ రోడ్‌షొలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు IUML పార్టీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలు ఎగరవేస్తూ రాహుల్ గాంధీకి మద్ధతు పలికిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఒక ఫేస్‌బుక్ యూసర్ 04 ఏప్రిల్ 2019 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. వయానాడ్‌ లోక్‌సభ నియాజకవర్గం కోసం ఎన్నికల నామినేషన్ ధాఖలు చేసిన తరువాత రాహుల్ గాంధీ, IUML పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్, IUML ఎంపీ పీకే కున్హాలికుట్టి సాహిబ్, ప్రియాంక గాంధీ మరియు ఇతర నాయకులతో కలిసి రోడ్‌షొ నిర్వహించిన దృశ్యాలంటూ ఈ వీడియో వివరణలో తెలిపారు. రాహుల్ గాంధీ వయానాడ్‌లో నామినేషన్ వేసిన తరువాత నిర్వహించిన రోడ్‌షొ దృశ్యాలను మరికొందరు యూసర్లు కూడా 2019 ఏప్రిల్ నెలలో షేర్ చేశారు.

వీడియోలోని దృశ్యాలను జాగ్రత్తగా గమనిస్తే, ఈ వీడియోలో కనిపిస్తున్న పచ్చ రంగు జెండాలు IUML పార్టీ జెండాలని తెలిసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అనేది కేరళ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ పార్టీ. IUML పార్టీ జెండాకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ చూడవచ్చు. IUML పార్టీ జెండాను పాకిస్థాన్ జాతీయ జెండాగా చిత్రీకరిస్తు తమ పార్టీ పై ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని IUML ‘05 ఏప్రిల్ 2019’న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసింది.

2019 ఏప్రిల్ నెలలో కేరళ వయనాడ్‌లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఈ ర్యాలీకి సంబంధించిన వీడియోలను ముస్లిం లీగ్ పార్టీ తమ సోషల్ మీడియా పేజీలలో షేర్ చేసింది. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు ఈ వీడియోలో ఊపుతున్న పచ్చ జెండా IUML పార్టీ జెండా అని, పాకిస్థాన్ జెండా కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

IUML పార్టీ జెండాకు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన మరికొన్ని అవాస్తవ ప్రచారాలకు సంబంధించి ఫాక్ట్ లీ ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. అవి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2019లో రాహుల్ గాంధీ వయనాడ్‌లో నిర్వహించిన రోడ్‌షొలో IUML పార్టీ జెండాలను ఊపిన వీడియోని రాహుల్ ర్యాలీలో పాకిస్థాన్ జెండాలను ఊపుతున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll