‘రాహుల్ గాందీ చేపట్టిన BHAARATH-JODO యాత్రలో “పాకిస్తానీ జెండాలు“’ అని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులోని నిజానిజాల్ని ఈ ఆర్టికల్ ద్వారా పరిశీలిద్దాం .
క్లెయిమ్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కనిపిస్తున్న పాకిస్తాన్ దేశ జెండాలు.
ఫ్యాక్ట్ (నిజం) : వీడియోలో కనిపిస్తున్న జెండాలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అనే కేరళకి చెందిన రాజకీయ పార్టీ జెండాలు. వీడియోలో ఉన్న బ్యానర్ లో IUML pattambi madalam commitee అని రాసి ఉంది. IUML పార్టీ జెండాలని పాకిస్తాన్ దేశ జెండాలుగా పోస్టులో చెప్తున్నారు కాబట్టి అది తప్పు.
వీడియోలో కనిపిస్తున్న బ్యానర్‌లో IUML pattambi madalam commitee (IUML పట్టంబి మండలం కమిటి) అని రాసి ఉంది. దీన్ని ఆధారంగా తీస్కొని ఇంటెర్నెట్‌లో వెతకగా రెండు ఫేస్‌బుక్ పోస్ట్ లు కనిపించాయి. ‘IUML Koppam Koppam’ అనే ఫేస్‌బుక్ అకౌంట్‌లో సెప్టెంబర్ 27న వీటిని అప్లోడ్ (ఇక్కడ మరియు ఇక్కడ) చేసారు. వీడియోలో ఉన్న విజువల్స్ ఈ పోస్టులలో ఉన్న ఫొటోలతో సరిపోయాయి.
IUML-ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఒక రాజకీయ పార్టీ. IUML కేరళలో రాష్ట్ర పార్టీగా భారత ఎన్నికల సంఘంచే గుర్తించబడింది. వీడియోలో కనిపిస్తున్న జెండా ఈ పార్టీకి సంబంధించినదే, పాకిస్తాన్ జాతీయ జెండా కాదు. ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కింద ఉన్న చిత్రంలో చూడవచ్చు. ఎడమవైపు ఉన్నది IUML పార్టీ జెండా, కుడివైపున పాకిస్తాన్ దేశ జాతీయ జెండాను చూడవచ్చు. IUML పార్టీ గురించి మరిన్ని వివరాలను ఇక్కడ చూడవచ్చు. పార్టీకి ఫేస్‌బుక్‌లో అధికారిక హ్యాండిల్ కూడా ఉంది.
ఇదివరకు కుడా IUML పార్టీ జెండాను పాకిస్తాన్ జెండాగా తప్పుగా వార్తలు వచ్చినప్పుడు Factly ఆర్టికల్స్ ని ప్రచురించింది, వాటిని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.
చివరిగా, ఈ వీడియోలో కనిపిస్తున్న జెండాలు పాకిస్తాన్ దేశానివి కావు, ఇవి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండాలు.