Fake News, Telugu
 

మొరాదాబాద్ అల్లర్లకు సంబంధించిన జ్యుడిషియల్ కమిషన్ తమ నివేదికను 1983లోనే ప్రభుత్వానికి సమర్పించింది

0

1980 నాటి మొరాదాబాద్ అల్లర్లకు కారణమైన ఇద్దరు ముస్లిం లీగ్ సూత్రదారులను దోషులుగా ప్రకటించేందుకు జ్యూడీషియల్ ప్యానల్‌కు 43 ఏళ్లు పట్టిందని, ఈ లోపు ఇద్దరు దోషులు వృద్ధాప్యంతో మరణించారని చెప్తూ, దీనికి న్యాయవ్యవస్థను తప్పు బడుతున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: 1980 నాటి మొరాదాబాద్ అల్లర్లకు కారణమైన ఇద్దరు ముస్లిం లీగ్ సూత్రదారులను దోషులుగా ప్రకటించేందుకు జ్యూడీషియల్ ప్యానల్‌కు 43 ఏళ్లు పట్టింది.

ఫాక్ట్(నిజం): 1980లో జరిగిన మొరాదాబాద్ అల్లర్లకు సంబంధించిన ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ తమ నివేదికను 1983లోనే ప్రభుత్వానికి సమర్పించింది. కాగా ఈ 40 ఏళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ మరియు  జనతాదళ్ పార్టీలు ఏవి కూడా ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. కాబట్టి ఈ ఆలస్యానికి జ్యుడిషియల్ కమిషన్/న్యాయవ్యవస్థ భాద్యత కాదని స్పష్టమవుతుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆగష్టు 2023లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1980 నాటి మొరాదాబాద్ అల్లర్లకు సంబంధించిన జ్యుడిషియల్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ అల్లర్లకు ముస్లిం లీగ్‌కు చెందిన ఇద్దరు నాయకులు హమీద్ హుస్సేన్ అలియాస్ అజ్జీ మరియు షమీమ్ అహ్మద్ కారకులని, అల్లర్లలో RSS మరియు సాధారణ ముస్లింల పాత్ర ఏమి లేదని ఈ నివేదిక పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ఆనాటి అల్లర్లకు కారకులైన వారిని దోషులుగా తేల్చడానికి 43 ఏళ్లు పట్టిందని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. కానీ, నిజానికి జ్యుడిషియల్ కమిషన్ తమ నివేదికను 1983లోనే ప్రభుత్వానికి సమర్పించింది.

సుమారు 100 మంది చనిపోయిన మొరాదాబాద్ అల్లర్ల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఈ ఘటనను విచారించేందుకు వి.పి. సింగ్ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ M.P సక్సేనా నేతృత్వంలో ఒక వన్ మ్యాన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌ 1983లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

ఐతే గత 40 సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఈ నివేదికను బహిర్గతం చేయకుండా ఉంచాయి. ఈ కాలంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ మరియు  జనతాదళ్ పార్టీలు ఏవి కూడా ఈ నివేదికను బహిర్గతం చేయలేదు. కాబట్టి ఈ అల్లర్లకు సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ విచారణలో ఆలస్యం కాలేదని స్పష్టమవుతుంది. దీనికి సంబంధించిన పలు వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ.

చివరగా, మొరాదాబాద్ అల్లర్లకు సంబంధించిన జ్యుడిషియల్ కమిషన్ తమ నివేదికను 1983లోనే ప్రభుత్వానికి సమర్పించింది.

Share.

About Author

Comments are closed.

scroll