Fake News, Telugu
 

నరేంద్ర మోదీ కుటుంబసభ్యులు, బంధుమిత్రుల పదోన్నతలు, ఆర్ధిక పరిస్థితులకు సంబంధించి షేర్ చేస్తున్న ఈ సమాచారం తప్పు

0

నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత అతని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల పదోన్నతులు, ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులను తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. ఈ పోస్టులో తెలుపుతున్న వివరాలలో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.   

క్లెయిమ్: నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత అతని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రుల ఆర్ధిక పరిస్థితులు మెరుగయ్యాయి, పదవులు వచ్చాయి.

ఫాక్ట్ (నిజం): నరేంద్ర మోదీ కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రుల పదోన్నతలు, ఆర్ధిక పరిస్థితులకు సంబంధించి ఈ పోస్టులో షేర్ చేస్తున్న సమాచారం తప్పు. నరేంద్ర మోదీ కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రుల ఆర్ధిక పరిస్థితుల వివరాలని తెలుపుతూ అనేక వార్తా సంస్థలు గతంలో రిపోర్ట్ చేసాయి. ఈ రిపోర్టులలో తెలిపిన సమాచారం ప్రకారం పోస్టులో చేసిన క్లెయిమ్స్ ఏవి కూడా నిజం కాదని తెలిసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.    

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, నరేంద్ర మోదీ కుటుంబ సభ్యుల వివరాలని తెలుపుతూ ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ 31 డిసెంబర్ 2016 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పటీకీ, వారి కుటుంబ సభ్యులు నిరాడంబర మధ్యతరగతి జీవనశైలిని కొనసాగిస్తున్నారని ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ ఈ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. దామోదర్ దాస్ ముల్చంద్ మోదీ మరియు హీరాబీన్ దంపతులకు మూడో సంతానంగా జన్మించిన నరేంద్ర మోదీకి నలుగురు అన్నదమ్ములు, ఒక సోదరి ఉన్నారు. పోస్టులో నరేంద్ర మోదీ సోదరులకు, బంధుమిత్రులకు సంబంధించి షేర్ చేసిన సమాచారంలో ఎంతవరకు నిజముందో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

సొంభాయ్ మోదీ గుజరాత్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మనుగా పనిచేస్తున్నారు

రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్ అయిన నరేంద్ర మోదీ పెద్ద అన్నయ్య సొంభాయ్ మోదీ, నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత గుజరాత్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మనుగా పదవి బాధ్యతలను చేపట్టారని ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా వేర్వేరు విభాగాలకు వేర్వేరు రిక్రూట్‌మెంట్ బోర్డులను కలిగి ఉంటుంది. అన్నీ రిక్రూట్‌మెంట్ బోర్డులకు ఒకే ఛైర్మన్ కలిగి ఉండరు. పోస్టులో తెలుపుతున్నట్టు సొంభాయ్ మోదీ ఏదయినా గుజరాత్ రిక్రూట్‌మెంట్ బోర్డుకి ఛైర్మనుగా పనిచేస్తున్నారా అని వేతకగా, గుజరాత్ లోకరక్షకర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ, సబ్-ఆర్డినెట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డుతో సహా మరే ఇతర గుజరాత్ రిక్రూట్‌మెంట్ బోర్డుకి సొంభాయ్ మోదీ ఛైర్మన్‌గా లేరని తెలిసింది. 2016లో ‘ఇండియా టుడే’ పబ్లిష్ చేసిన కథనం ప్రకారం, సొంభాయ్ మోదీ, వాద్‌నగర్లో వృద్ధుల సంరక్షణ కేంద్రాన్ని నడుపుతున్నారని తెలిసింది. 2019లో సొంభాయ్ మోదీ ‘Zee న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోని ఇక్కడ చూడవచ్చు. 2021లో తేజస్వి సూర్య సొంభాయ్ మోదీ నడిపిస్తున్న దామోదర్ దాస్ మోదీ ఆశ్రమాన్ని సందర్శించి ఆ ఫోటోలని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. 

అమృత్ భాయ్ మోదీ ప్రస్తుతం అహ్మదాబాద్ మరియు గాంధీనగర్‌లలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి

ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఉద్యోగిగా పనిచేసే అమృత్ భాయ్ మోదీ, ప్రస్తుతం అహ్మదాబాద్ మరియు గాంధీనగర్‌లలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటూ ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలో ఫిట్టర్‌గా పనిచేసి రిటైర్ అయిన అమృత్ భాయ్ మోదీ, అహ్మదాబాద్‌ ఘట్లోడియా ప్రాంతంలో నాలుగు గదుల మధ్యతరగతి నివాసంలో కుటుంబంతో కలిసి రిటైర్డ్ జీవితాన్ని సాగిస్తున్నారని ‘ఇండియా టుడే’ వారు తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ఈ విషయాన్ని ‘టివి9′ వార్తా సంస్థ కూడా ఇటీవల పబ్లిష్  చేసిన తమ ఆర్టికల్‌లో తెలిపింది. అమృత్ భాయ్ మోదీ అహ్మదాబాద్ మరియు గాంధీనగర్‌లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు ఎక్కడా రిపోర్ట్ అవ్వలేదు. 

ప్రహ్లాద్ మోదీకి అహ్మదాబాద్, వడోదర నగరాలలో హ్యూండాయి, మారుతి మరియు హోండా షోరూంలు ఉన్నాయి

నరేంద్ర మోదీ తమ్ముడు ప్రహ్లాద్ మోదీ ఒక రేషన్ దుకాణం యజమాని మరియు ఆల్  ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ అసోసియేషన్ (AIFPSDF) ఉపాధ్యక్షులు అని తెలిసింది. జీవన వ్యయాలు, దుకాణాల నిర్వహణ ఖర్చులు పెరిగిన ప్రస్తుత పరిస్థితిలో, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల కమిషన్లో కిలోకు కేవలం 20 పైసలు పెంచడం క్రూరమైన చర్యగా పేర్కొంటూ ఇటీవల ప్రహ్లాద్ మోదీ నేతృత్వంలోని AIFPSDF ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర భారీ ధర్నా నిర్వహించారు. ప్రహ్లాద్ మోదీకి అహ్మదాబాద్, వడోదర నగరాలలో హ్యూండాయి, మారుతి మరియు హోండా షోరూంలు ఉన్నాయని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. ఈ విషయానికి సంబంధించి అహ్మదాబాదులోని ఒక మారుతి షోరూం మాజీ సిఈఓ ‘ఆల్ట్ న్యూస్’తో మాట్లాడుతూ, “నాకు తెలిసినంతవరకు నగరంలోని షోరూంలలో ఏవి నరేంద్ర మోదీ కుటుంబానికి లేదా బంధుమిత్రులకి సంబంధించినవి లేవు. ఈ దావా నిరాధారమైనది మరియు తప్పు అని నేను ఖచ్చితంగా చెప్పగలను”, అని తెలిపారు. 

పంకజ్ మోదీ ప్రస్తుతం సోంభాయ్‌తో పాటు గుజరాత్ రిక్రూట్‌మెంట్ బోర్డులో వైస్ చైర్మన్‌గా ఉన్నారు

నరేంద్ర మోదీ చిన్న తమ్ముడు పంకజ్ మోదీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో పనిచేసి రిటైరయి ప్రస్తుతం గుజరాత్ గాంధీనగర్లో స్థిరపడినట్టు ‘టివి9′ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేశారు. నరేంద్ర మోదీ తల్లి హీరాబీన్ ప్రస్తుతం పంకజ్ మోదీ నివాసంలోనే ఉంటారు. పంకజ్ మోదీ ఏ ఒక్క గుజరాత్ రిక్రూట్‌మెంట్ బోర్డుకి ఉపాధ్యక్షులుగా ఎన్నికయినట్టు ఎక్కడ సమాచారం దొరకలేదు.

భోగిలాల్ మోదీ నేడు అహ్మదాబాద్, సూరత్ మరియు వడోదరలో రిలయన్స్ మాల్స్‌ను కలిగి ఉన్నారు.

రిలయన్స్ మాల్ అనేది రిలయన్స్ రిటైల్ కంపెనీ యొక్క సబ్-బ్రాండ్. రిలయన్స్ మాల్స్‌లను  బయటివారు ఎవరూ సొంతం చేసుకోలేరు, ఎందుకంటే రిలయన్స్ రిటైల్ కంపెనీ ఫ్రాంచైజీ వ్యవస్థను పాటించదు. దీనిబట్టి, నరేంద్ర మోదీ బంధువు భోగిలాల్ మోదీ అహ్మదాబాద్ మరియు సూరత్  నగరాలలో రిలయన్స్ మాల్స్‌లను కలిగి ఉన్నారనే ప్రచారంలో ఎటువంటి నిజం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. నరేంద్ర మోదీ బంధువు భోగిలాల్ మోదీకి వాద్‌నగర్లో ఒక గ్రోసరీ షాప్ (కిరాణా) ఉన్నట్టు ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. 

అరవింద్ భాయ్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మరియు స్టీల్ కాంట్రాక్టర్; భరత్ భాయ్ మోదీకి పదకొండు పెట్రోల్ పంపులు ఉన్నాయి; అశోక్ మోదీ భోగిలాల్ మోదీతో కలిసి రిలయన్స్ మాల్స్‌లలో భాగస్వామిగా ఉన్నారు.

‘ఇండియా టుడే’ వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్‌లో అరవింద్ భాయ్ మోదీ, ఇంటింటికి వెళ్లి ఉపయోగించిన ఆయిల్ టిన్లు, పెట్టెలు మరియు ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి వాటిని డీలర్లకు  అమ్మడం ద్వార నెలకు 9,000 రూపాయలు సంపాధిస్తారని తెలిపారు. నరేంద్ర మోదీ మరో బంధువు భరత్ భాయ్ మోదీకి వాద్‌నగర్ సమీపంలోని లాలావాడా గ్రామంలోని ఒక గ్యాస్ స్టేషన్లో పెట్రోల్ బంక్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారని ‘ఇండియా టుడే’ తమ ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసింది. అలాగే, నరేంద్ర మోదీ మరో బంధువు అశోక్ మోదీ, వాద్‌నగరులోని ఘీకంట బజారులో పతంగులు, క్రాకార్లు, బిస్కెట్లు, స్నాక్స్ అమ్మే దుకాణం కలిగి ఉన్నట్టు తెలిసింది. అశోక్ మోదీ, భోగిలాల్ మోదీతో కలిసి రిలయన్స్ మాల్స్‌లలో భాగస్వామిగా ఉన్నారనే విషయం పూర్తిగా అవస్తావమని పై వివరాల ఆధారంగా చెప్పవచ్చు.

పోస్టులో షేర్ చేసిన మరికొన్ని క్లెయిమ్స్ స్పష్టంగా లేకపోవడంతో వాటికి సంబంధించిన వివరాలని ఫాక్ట్-చెక్ చేయడానికి కుదరలేదు. ఈ పోస్టులో షేర్ చేసిన క్లెయిమ్స్ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో షేర్ అవుతునే ఉన్నాయి. ఈ పోస్టులలో చేస్తున్న క్లెయిమ్స్ తప్పని పలువురు జర్నలిస్టులు  మరియు పలు వార్తా సంస్థలు స్పష్టం కూడా చేసాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో నరేంద్ర మోదీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు సంబంధించి తెలుపుతున్న సమాచారం తప్పని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, నరేంద్ర మోదీ కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రుల పదోన్నతలు, ఆర్ధిక పరిస్థితులకు సంబంధించి షేర్ చేస్తున్న ఈ సమాచారం పూర్తిగా తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll