Fake News, Telugu
 

శవానికి చికిత్స అందిస్తున్న ఈ వీడియోలోని ఘటన విశాఖ మెడీకవర్ ఆసుపత్రిలో చోటుచేసుకోలేదు

0

విశాఖ మెడీకవర్ ఆసుపత్రిలో వైద్యులు చనిపోయిన మనిషి శవానికి ఆక్సిజన్ ఎక్కిస్తూ పట్టుబడిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: విశాఖ మెడీకవర్ ఆసుపత్రిలో డాక్టర్లు శవానికి ఆక్సిజన్ ఎక్కిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని ఘటన విశాఖపట్నంలోని ఎస్ఆర్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చేయి విరిగిందని వచ్చిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి, ఎస్ఆర్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ వీడియోలోని ఘటన మెడీకవర్ ఆసుపత్రిలో చోటుచేసుకోలేదని మెడీకవర్ సంస్థ వారు ఒక మీడియా ప్రకటన విడుదల చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.  

వీడియోలోని ఘటన విశాఖ మెడీకవర్ ఆసుపత్రిలో చోటుచేసుకోలేదని మెడీకవర్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అనుజా పట్నాయక్ మరియు మెడీకవర్ ఆసుపత్రి బయో మెడికల్ డిపార్ట్మెంట్ హెడ్ జగదీష్ ఈ పోస్ట్ కింద కామెంట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెడీకవర్ ఆసుపత్రి ఇచ్చిన మీడియా ప్రకటనను ఆనుజ పట్నాయక్ ఈ పోస్ట్ కామెంట్ సెక్షన్లో  షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ వీడియో మెడీకవర్ ఆసుపత్రికి చెందినది కాదని, ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోని మెడీకవర్ ఆసుపత్రికి జాతచేస్తూ షేర్ చేస్తున్న వారిపై విశాఖపట్నంలోని ఎండాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఫైల్ చేసినట్టు మెడీకవర్ సంస్థ ఈ మీడియా ప్రకటనలో వెల్లడించింది.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో పోలి ఉన్న వీడియోని ‘Truth News’ అనే వార్తా సంస్థలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ షేర్ చేసినట్టు తెలిసింది. విశాఖపట్నం గోపాలపట్నంలోని ఎస్ఆర్ ఆసుపత్రిలో చనిపోయిన మనిషి శవానికి చికిత్స అందిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చిందని ఈ జర్నలిస్ట్ రిపోర్ట్ చేశారు.  

చేయి విరిగిందని చికిత్స కోసం అడ్మిట్ అయిన దుర్గాప్రసాద్, ఎస్ఆర్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన్నట్టు ‘Truth News’ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. చనిపోయిన దుర్గాప్రసాద్‌కి ఆక్సిజన్ ఎక్కిస్తూ వైద్యులు పట్టుబడినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రచురించిన కథనాలని మరికొందరు జర్నలిస్టులు కూడా షేర్ చేశారు. పై వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియోలోని ఘటన విశాఖ మెడీకవర్  ఆసుపత్రిలో చోటుచేసుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, శవానికి చికిత్స అందిస్తున్న ఈ వీడియోలోని ఘటన విశాఖ మెడీకవర్ ఆసుపత్రిలో చోటుచేసుకోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll