లడ్డూకు వినియోగించిన నెయ్యిలో ఆవు కొవ్వు ఉందని తెలిసిన తర్వాత శాస్ర్తోక్తంగా ఆవు పేడతో సంప్రోక్షణ చేసుకుంటున్న సనాతన సోదరులు అంటూ కొంతమంది ఆవు పేడను తమ ఒంటికి రాసుకుంటున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: లడ్డూకు వినియోగించిన నెయ్యిలో ఆవు కొవ్వు ఉందని తెలిసిన తర్వాత కొంతమంది శాస్ర్తోక్తంగా ఆవు పేడతో సంప్రోక్షణ చేసుకుంటున్న ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో అహ్మదాబాద్ శివార్లలోని శ్రీ స్వామినారాయణ గురుకుల విశ్వవిద్యా ప్రతిష్ఠానం గౌశాలలో కోవిడ్-19 కోసం కొంతమంది ఆవు పేడ చికిత్స అంటూ తమ శరీరాన్ని పేడతో శుభ్రం చేసుకుంటున్న సందర్భంలోది. దీని గురించి 2021లో పలు మీడియా ఛానెళ్లు ప్రచురించాయి. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, 2021లో పలు వార్తా కథనాల్లో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఈ ఫోటో ప్రచురించబడ్డట్టు మేము గమనించాం. ఈ రిపోర్టుల ద్వారా, ఈ ఫోటో అహ్మదాబాద్ శివార్లలోని శ్రీ స్వామినారాయణ గురుకుల విశ్వవిద్యా ప్రతిష్ఠానం గౌశాలలో కోవిడ్-19 కోసం కొంతమంది ఆవు పేడ చికిత్స అంటూ తమ శరీరాన్ని పేడతో శుభ్రం చేసుకుంటున్న సందర్భంలోది అని తెలుసుకున్నాం.
అయితే, ఈ ఫొటోకు సంబంధించిన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన X హ్యాండిల్ లో “దీనికి నవ్వాలా లేక ఏడవాలా” అంటూ 2021లో షేర్ చేసారు అని ఈ పత్రికలు వెల్లడించాయి. వీడియోలోని వ్యక్తులు ఆవు పేడ తమను కరోనా నుండి కాపాడుతుందని నమ్మి తమ శరీరాలకు ఆవు పేడను రాసుకొని యోగ చెయ్యటం ఈ వీడియోలో చూడవచ్చు. ఇదే వీడియోను ప్రచురిస్తూ పలు మీడియా ఛానల్స్ ఆవు పేడ కోవిడ్-19 నివారణగా పని చేస్తుంది అని ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు అని రిపోర్ట్ చేశాయి (ఇక్కడ మరియు ఇక్కడ).
చిరిగా, సంబంధం లేని పాత వీడియోను తిరుపతి లడ్డూలో ఆవు కొవ్వు కలిసినందుకు కొంతమంది శాస్ర్తోక్తంగా ఆవు పేడతో సంప్రోక్షణ చేసుకుంటున్న ఫోటో అంటూ షేర్ చేస్తున్నారు.