విదేశాల్లో తవ్వకాల జరపగా మహాభారత రథం బయటపడింది అని చెప్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: విదేశాల్లో తవ్వకాలు జరపగా బయటపడిన మహాభారత రథం యొక్క దృశ్యాలు.
ఫాక్ట్: వీడియోలోని దృశ్యాలు చైనాలోని ‘అన్ యాంగ్’ నగరం సమీపంలో ఉన్న “Yin Xu” మ్యూజియానికి చెందినవి. ఇక్కడ ఉన్న ప్రాచీన సమాధుల్లో మనుషుల ఎముకులతో పాటు, రథ చక్రాలు, వివిధ ఆభరణాలు, పాత్రలు కూడా లభించాయి. ఇవి 3300 ఏళ్ల నాటి శాంగ్ రాజ్య వంశం పాలిస్తున్నప్పటి వస్తువులుగా యునెస్కో గుర్తించింది. మరియు, ఈ మ్యూజియంలో అనేక ప్రాచీన రథాలను కూడా చూడవచ్చు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా ఈ ప్రదేశం చైనాలోని ‘అన్ యాంగ్’ నగరం సమీపంలో ఉన్న “Yin Xu” మ్యూజియంలో ఉన్నట్లు గుర్తించాము. దీనికి సంబంధించిన మరిన్ని వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చైనా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు ప్రకారం, “Yin Xu” ప్రాంతం చైనాలోనే అతి ప్రాచీన పురావస్తు ప్రదేశాలలో ఒకటి. 19వ శతాబ్దం నుంచి ఇక్కడ తవ్వకాలను జరిపారు. క్రీ.పూ 16 నుండి 11వ శతాబ్దం మధ్యలో ఉన్న ‘శాంగ్(ఇన్)’ రాజవంశం పాలిస్తున్న కాలానికి చెందిన సుమారు 3300 ఏళ్ల నాటి వివిధ వస్తువులను, ఎముకలు, ఆభరణాలు, రథాలు ఇక్కడ ఉన్న మ్యూజియంలో చూడవచ్చు. ఇది UNESCO వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన ప్రదేశం. ఇక్కడ ఉన్న ప్రాచీన సమాధుల్లో మనుషుల ఎముకులతో పాటు, రథ చక్రాలు, వివిధ ఆభరణాలు, పాత్రలు కూడా లభించాయి.
ఈ మ్యూజియంలో భద్రపరిచిన మరిన్ని రథాల ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, చైనా మ్యూజియంలో ఉన్న 3300 ఏళ్ల క్రితం శాంగ్ వంశం పాలిస్తున్న కాలం నాటి రథ చక్రాలను మహాభారత రథంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.