Fake News, Telugu
 

స్వామి శ్రద్దానంద్‌ను కాల్చి చంపిన అబ్దుల్ రషీద్‌కు పడిన ఉరి శిక్షను గాంధీ ఆపించాడన్న వార్తలో నిజంలేదు

0

‘మహాత్మా గాంధీ ఆర్యసమాజ్ నాయకుడు స్వామి శ్రద్దానంద్‌ను కాల్చి చంపిన అబ్దుల్ రాషీద్‌కు పడిన ఉరి శిక్షను ఆపించాడు కాని భగత్ సింగ్‌కు పడిన ఉరి శిక్షను మాత్రం ఎంత మంది చెప్పిన ఆపించలేదని’ చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ విషయానికి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:మహాత్మా గాంధీ స్వామి శ్రద్దానంద్‌ను చంపిన అబ్దుల్ రషీద్‌కు పడిన ఉరి శిక్షను ఆపించాడు కాని భగత్ సింగ్‌కు పడిన ఉరి శిక్షను మాత్రం ఆపించలేదు’.

ఫాక్ట్ (నిజం): స్వామి శ్రద్దానంద్‌ను చంపిన అబ్దుల్ రషీద్‌ను ఉరి తీసారు. గాంధీ రషీద్‌కు పడ్డ ఉరి శిక్షను రద్దు చేయించాడన్నది అవాస్తవం. రషీద్‌ ఉరిని రద్దు చేయాలని గాంధీ పిటిషన్ లేదా లేఖ రాసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. రషీద్ ఇలా చేయడానికి సమాజంలో రెండు మతాల మధ్య ఉన్న ద్వేషమే కారణం అని మాత్రం గాంధీ అభిప్రాయపడ్డారు. అలాగే గాంధీ భగత్ సింగ్ ఉరిని రద్దు చేయించలేనప్పటికీ, రద్దు చేయించడం కోసం ప్రయత్నించాడు. భగత్ సింగ్‌ని ఉరి తీసే రోజు కొన్ని గంటల ముందు కూడా గాంధీ భగత్ సింగ్‌ ఉరి శిక్షని రద్దు చేయాలని కోరుతూ అప్పటి వైస్రాయ్‌ లార్డ్ ఇర్విన్‌కి లేఖ రాసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

స్వామి శ్రద్దానంద్‌:

23 డిసెంబర్ 1926న అబ్దుల్ రషీద్‌ కొన్ని మతపరమైన విషయాలు చర్చించాలనే కారణంతో స్వామి శ్రద్దానంద్‌ ఇంటికి వచ్చాడు. స్వామి సహాయకుడైన ధర్మపాల్‌ని రషీద్‌ నీళ్ళ కోసం అడగడంతో అతను లోపలికి వెళ్ళాడు, ఈలోపు రషీద్‌ స్వామిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో రెండు సార్లు కాల్చాడు. ఈలోపు అక్కడికి చేరుకున్న ధర్మపాల్ రషీద్‌ను పట్టుకొని పోలీసులుకు  అప్పగించాడు. రషీద్‌పై కేసు నమోదు చేసి చివరకు ఉరి తీసారు.  

గాంధీ రషీద్‌కు పడ్డ ఉరి శిక్షను రద్దు చేయించాడన్నది అవాస్తవం, పైగా రషీద్‌ ఉరిని రద్దు చేయాలని గాంధీ పిటిషన్ లేదా లేఖ రాసినట్టు ఎటువంటి ఆధారాలు మాకు లభించలేదు. ఐతే 26 – 28 డిసెంబర్ 1926 రెండు రోజులు గౌహతిలో కాంగ్రెస్ సెషన్ జరిగగా, గాంధీ ఈ సెషన్‌లో స్వామి శ్రద్దానంద్‌ మరణానికి సంబంధించి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ప్రసంగంలో గాంధీ మాట్లాడుతూ స్వామి హత్యకి సమాజంలో రెండు మతాల మధ్య ఉన్న ద్వేషమే కారణమని, ఇలా ఒకరిపై మరొకరు ద్వేషం ఏర్పరచుకునేలా చేస్తున్నవారు నిజమైన నిందితులని అభిప్రాయపడ్డారు. ఇదే మీటింగ్ లో అబ్దుల్ రషీద్ ని తన సోదరుడు అని గాంధీ సంబోధించాడు. రషీద్ ని స్వామి హత్యకి దోషిగా కూడా తాను పరిగణించనని, సమాజంలో ఒకరి పట్ల ఒకరికి ద్వేషాన్ని నింపిన వారిని తాను దోషులుగా పరిగణిస్తామని కూడా ఈ మీటింగ్ లో గాంధీ అన్నారు.

స్వామి మరణం గురించి గాంధీ తాను రాసే పత్రిక/ జర్నల్ అయిన యంగ్ ఇండియాలో కూడా ప్రస్తావించారు. గాంధీ స్వామి మరణానికి సమాజంలో మతాల మధ్య ఉన్న ద్వేషాన్ని తప్పుబట్టారు. దీనికి కారణం వార్తా పత్రికలని అయన అభిప్రాయపడ్డారు. వార్తా పత్రికలు అబద్ధాలు, అపవాదుల ద్వారా ఈ ద్వేషాన్ని అంటువ్యాధిలాగా వ్యాప్తి చేస్తున్నాయని, వార్తా పత్రికల్లో రాసేదాని ద్వారా ప్రజల మనసులో ద్వేషం నింపుతున్నారనే భావన అయన వ్యక్తం చేసారు. అందువల్ల అబ్దుల్ రషీద్‌కు కలిగిన ఈ ద్వేశాభావానికి  విద్యావంతులు, సెమీ-ఎడ్యుకేట్ తరగతికి చెందిన మనలాంటి వారిదే బాధ్యతని, ఈ పరిస్థితికి రెండు వర్గాలును నిందించాలని, కేవలం ఒక వర్గాన్నే నిందించడం అనవసరమని అయన అభిప్రాయపడ్డారు. గాంధీహెరిటేజ్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న  ది కల్లెక్టేడ్ వర్క్స్ అఫ్ మహాత్మా గాంధీ (వాల్యూం 37)లో కూడా ఇది చూడొచ్చు.

భగత్ సింగ్:

బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ సాండర్స్ ని చంపిన నేరానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్‌ని 23 మార్చ్ 1931న ఉరి తీసింది. మరణశిక్ష అనేది వ్యక్తి మారడానికి అవకాశం ఇవ్వదని, భగత్ సింగ్‌కి విధించిన ఉరి శిక్షని సస్పెండ్ చేయాలనీ కోరుతూ, అక్టోబర్ 1930లో గాంధీ ఇర్విన్‌తో అన్నాడు.

భగత్ సింగ్‌ని ఉరి తీసే రోజు కొన్ని గంటల ముందు కూడా గాంధీ భగత్ సింగ్‌ ఉరి శిక్షని ఆపడానికి ప్రయత్నం చేసాడు, ఉరి శిక్షను రద్దు చేయాలనీ కోరుతూ అప్పటి వైస్రాయ్‌ లార్డ్ ఇర్విన్‌కి లేఖ రాసాడు.

ఐతే గాంధీ అభ్యర్థనను బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించకుండా భగత్ సింగ్‌ని ఉరి తీసింది. దీన్నిబట్టి ఉరి శిక్షని ఆపలేకపోయినప్పటికి, ఆపడానికి ప్రయత్నించాడని చెప్పొచ్చు.

చివరగా, స్వామి శ్రద్దానంద్‌ను కాల్చి చంపిన అబ్దుల్ రషీద్‌కు పడిన ఉరి శిక్షను గాంధీ ఆపించాడన్న వార్తలో నిజంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll