Fake News, Telugu
 

అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకంగా ఈ ప్లకార్డ్ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులు ప్రదర్శించలేదు

0

రైతుల నిరసనల్లో అయోధ్యలో నిర్మించబోయే రాముడి గుడికి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శించారని చెప్తూ, దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రైతుల నిరసనల్లో అయోధ్యలో నిర్మించబోయే రాముడి గుడికి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శించారు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో భారత్ లో నిరసనలు తెలుపుతున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ లో ఉన్న భారత కాన్సులేట్ ఎదురుగా కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసన తెలిపిన ఘటనకి సంబంధించింది. ఈ ఫోటోకి ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది కొంచెం తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షేర్ చేస్తూ 29 జనవరి 2021న చేసిన ట్వీట్ మాకు కనిపించింది. ఈ ట్వీట్ ప్రకారం ఈ ఫోటోలు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన నిరసనలకు సంబంధించినవి. ఈ ఫోటోలలో నిరసనకారుల వెనకాల ఉన్న బిల్డింగ్స్ గమనించొచ్చు. పైగా అగ్నిహోత్రి ఈ నిరసనలకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేసాడు.

ఐతే అగ్నిహోత్రి పోస్ట్ చేసిన ఫోటోని, వీడియో స్క్రీన్ షాట్స్ ని మరియు శాన్ ఫ్రాన్సిస్కొ లోని భారత కాన్సులేట్ యొక్క గూగుల్ స్ట్రీట్ వ్యూ ఇమేజ్ ని పోల్చి చూస్తే, వీటన్నిటిలో నిరసనకారుల వెనకాల కనిపించే బిల్డింగ్స్ ఒకేలా ఉండడం గమనించొచ్చు. దీన్నిబట్టి మూడింటిలో ఉన్నది ఒకే  ప్రదేశమని ధృవీకరించవచ్చు.

ఈ ట్వీట్ ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా 26 జనవరి 2021న శాన్ ఫ్రాన్సిస్కొలోని భారత కాన్సులేట్ బయట భారతలో జరుగుతున్న రైతుల నిరసనలకు మద్దతుగా ఖలిస్తాన్ మద్దతుదారులు నిరసనలు తెలిపారని చెప్పే వార్తా కథనం మాకు కనిపించింది. వీటన్నిటి ఆధారంగా పోస్టులో ఉన్న ఫోటో ఢిల్లీలో జరుగుతున్న నిరసనలకు సంబంధించింది కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకంగా ఈ ప్లకార్డు ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులు ప్రదర్శించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll