Fake News, Telugu
 

ఈ ఫోటోకి, అందులో వార్తకి ఎటువంటి సంబంధంలేదు, రెండు వేరు వేరు సంఘటనలకు సంబంధించినవి

0

‘పాడె మోసి ప్రచారం చేసుకుంటున్నారు’ అనే హెడ్డింగ్ తో ఉన్న ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ని మరియు ఒక హిందువు పాడెని కొందరు ముస్లిములు మోస్తున్న ఫోటోని షేర్ చేస్తూ, రెండు ఫోటోలు ఒకే సంఘటనికి సంబంధించినవి అర్ధం వచ్చేలా ‘పాడె మాత్రమే మోసి, ప్రచారం మాత్రం మొత్తం మేమే నిర్వహించాము అని చెప్పుకున్న ముస్లిం వ్యక్తులు’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక హిందువు పాడె మోసి ప్రచారం చేసుకుంటున్న కొందరి ముస్లిముల కి సంబంధించిన ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులోని ఫోటో మరియు కథనం రెండింటికి సంబంధం లేదు, రెండు వేరు వేరు ఘటనలకు సంబంధించినవి. ఈ వార్తా కథనం ఆంధ్రజ్యోతి 21 ఏప్రిల్ 2020న ప్రచురించింది. ఇకపోతే ఈ ఫోటో మాత్రం ఇటీవల ఏప్రిల్ లో కర్ణాటక లో ఒక హిందువు చివరి కర్మలలో కొందరు ముస్లిములు సహాయ పడ్డ ఘటనకి సంబంధించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో ఉన్న పేపర్ క్లిప్పింగ్ ని జాగ్రతగ్గా పరిశీలించినప్పుడు అది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ యొక్క క్లిప్పింగ్ అని స్పష్టమవుతుంది. దీని ఆధారంగా గూగుల్ లో వెతకగా ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఈ కథనానికి సంబంధించిన ఆన్లైన్ క్లిప్ మాకు కనిపించింది. ఐతే ఒక హిందువు పాడె మోసి కొందరు ముస్లిములు (మాజీద్, సాదిక్ బిన్, సలాం, అబ్దుల్ ఖదీన్, అహ్మద్, షేక్ ఖాసీమ్) ప్రచారం చేసుకుంటున్నారని చెప్పే ఈ కథనం నిజమైనప్పటికి, ఈ వార్త మాత్రం పాతది. ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని 21 ఏప్రిల్ 2020న ప్రచురించింది. పైగా ఈ కథనంలో ఆంధ్రజ్యోతి ఈ ఘటనకి సంబంధించి ఎటువంటి ఫోటో ప్రచురించలేదు.

ఐతే పోస్టులోని ఫోటో గురించిన మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా ఈ ఫోటోలోని సంఘటనకి సంబంధించిన వీడియోని NDTV జర్నలిస్ట్ ఉమా సుదీర్ 09 మే 2021న తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసిన పోస్టు మాకు కనిపించింది. ‘రంజాన్ నెలలో ఉపవాసం పాటించే ముస్లిములు కర్ణాటక లో ఒక హిందువు పాడె మోసినట్టు’ అర్ధం వచ్చేలా ఈ పోస్టులో వీడియోకి సంబంధించి వివరణ ఇచ్చారు.

ఐతే పైన తెలిపిన ట్వీట్ ఆధారంగా గూగుల్ లో వెతకగా కర్ణాటక లో కొందరు ముస్లిం యువకుల ఒక హిందువు చివరి కర్మలలో సహాయం చేసినట్టు తెలిపే 27 ఏప్రిల్ 2021 టైమ్స్ అఫ్ ఇండియా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ‘కర్ణాటక లోని కొప్పాల్ కి చెందిన విట్టల్ రావు మహేన్ద్రాకర్ ఊపిరి అందక చనిపోయారు, ఐతే అతనికి కోవిడ్ లక్షణాలు ఉండడంతో చివరి కర్మలలో సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ఈ విషయం గురించి ఫోన్ ద్వారా తెలుసుకున్న హ్యూమానిటేరియన్ రిలీఫ్ సొసైటీ (HRS) సంస్థ కొందరు ముస్లిం వాలంటీర్స్ ని పంపించింది. ఈ వాలంటీర్స్ విట్టల్ రావు చివరి కర్మలలో సహాయం చేసారు’. దీన్నిబట్టి, పైన ట్వీట్ లో షేర్ చేసిన వీడియో ఈ కథనంలో చెప్తున్న సంఘటనకి సంబంధించింది అయ్యుంటుందని అర్ధమవుతుంది.

ఐతే ఈ కథనంలో చివరి కర్మలలో సహాయం చేసిన ఐదుగురు ముస్లిం వాలంటీర్స్ ల పేర్లు కూడా ప్రచురించారు. వారి పేర్లు ‘అస్గర్ ఖాన్, గౌస్ పటేల్, సాజిద్ హుస్సేన్, రహమత్ హుస్సేన్ మరియు మహ్మద్ అఖిల్’. ఐతే పోస్టులోని ఆంధ్రజ్యోతి కథనంలో ప్రచురించిన ముస్లిం వ్యక్తుల పేర్లు టైమ్స్ అఫ్ ఇండియా కథనంలోని పేర్లు ఒకేలా లేకపోవడంతో పోస్టులోని ఫోటోకి మరియు ఆంధ్రజ్యోతి కథనానికి ఎటువంటి సంబంధంలేదని స్పష్టమవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆంధ్రజ్యోతి కథనం నిజమైనప్పటికీ, పోస్టులో షేర్ చేసిన ఫోటో ఆ కథనానికి సంబంధించినట్టు అర్థం వచ్చేలా ఉండడంతో ప్రజలు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తుల గురించి తప్పుగా అర్ధం చేసుకొనే ఆస్కారం ఉంది.   

చివరగా, ఈ ఫోటోకి మరియు ఈ వార్తా కథనానికి ఎటువంటి సంబంధంలేదు, రెండు వేరు వేరు సంఘటనలకు సంబంధించినవి.

Share.

About Author

Comments are closed.

scroll